ఈ మధ్య కాలంలో విమానాల్లో గొడవలు, అసభ్యకర సంఘటనలు ఎక్కువయిపోయాయి. తరచుగా ఏదో ఒక సంఘటన వార్తల్లో నిలుస్తూ వస్తోంది. తాజాగా, విమానంలోని బిజినెస్ క్లాస్లో ఓ వ్యక్తి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. మద్యం మత్తులో ఓ మహిళపై మూత్ర విసర్జన చేశాడు. ఈ సంఘటన ఇండియాకు చెందిన ఓ ప్రముఖ విమానయాన సంస్థకు చెందిన విమానంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం ఇండియాకు చెందిన ఓ ప్రముఖ విమానయాన సంస్థకు చెందిన ఓ విమానం ప్రయాణికులతో న్యూయార్క్నుంచి ఢిల్లీకి బయలుదేరింది. ఓ మహిళ బిజినెస్ క్లాస్లో ప్రయాణిస్తోంది.
రాత్రి భోజనం చేసిన తర్వాత విమానంలోని లైట్లు ఆఫ్ చేయబడ్డాయి. విమానంలో కొంత చీకటిగా ఉంది. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి తన సీటులోంచి పైకి లేచాడు. తూలుతూ ఆ మహిళ సీటు దగ్గరకు వచ్చాడు. నిద్రలో ఉన్న ఆమెపై మూత్ర విసర్జన చేయటం మొదలుపెట్టాడు. ఈ హఠాత్పరిణామంతో ఆమె నిద్రపాడైంది. కళ్లు తెరిచి చూసే సరికి, అతడు మూత్రం పోస్తూ ఉన్నాడు. దీంతో ఆమె షాక్ తింది వెంటనే సీటులోంచి పైకి లేచి పక్కకు పరిగెత్తింది. గట్టిగా కేకలు వేసింది. దీంతో విమానంలోని సిబ్బంది అక్కడకు వచ్చారు. లైట్లు వెలిగాయి. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆమెతో పాటు ఆమె లగేజీ కూడా బాగా తడిసిపోయింది.
సిబ్బంది ఆమెకు వేరే దుస్తులు ఇచ్చారు. ఆమె తడిచిన బట్టలు తీసేసి దుస్తులు మార్చుకుంది. చివరకు ఘటన జరిగిన సీటులోనే ఆమెను కూర్చోబెట్టారు సిబ్బంది. అంతేకాదు! విమానంలో వికృత చేష్టలకు పాల్పడ్డ వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎయిర్పోర్టునుంచి పంపేశారు. ఈ మొత్తం ఘటనపై బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సంఘటనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం, విమాన సిబ్బంది సరైన విధంగా స్పందించకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి, విమానంలో వికృత చేష్టలకు సంబంధించిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.