కొన్ని రోజుల క్రితం రైలు పట్టాలు, ప్లాట్‌ఫామ్‌కు మధ్య ఇరుక్కుని.. నరకయాతన అనుభవించి.. ఓ యువతి మృతి చెందిన సంగతి తెలిసిందే. దీన్ని మరిచిపోకముందే.. మరో దారుణం చోటు చేసుకుంది. వేట కోసం వెళ్లిన ఓ వ్యక్తి.. సెల్‌ఫోన్ కోసం రెండు బండ రాళ్ల మధ్య చిక్కుకుపోయాడు. మంగళవారం సాయంత్రం నుంచి.. ఆ వ్యక్తి బండరాళ్ల మధ్య చిక్కుకుపోగా.. అతడిని కాపాడేందుకు పోలీసులు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డిపేట గ్రామానికి చెందిన షాడ రాజు మంగళవారం సాయంత్ర వేట కోసం అడివిలోకి వెళ్లాడు. అలా తిరుగుతుండగా.. అతడికి ఓ చోట రాళ్ల గుట్టపై ఏదో జంతువు ఉన్నట్లు అలికిడి వినిపించింది. దాంతో ఆ రాళ్లపైకి వెళ్లి వెతుకుతుండగా.. అనుకోకుండా.. రాజు చేతిలో ఉన్న మొబైల్.. జారి.. రాళ్ల మధ్యలో పడిపోయింది.
ఫోన్ పోతే పోయింది అనుకుంటే.. మనం ఇప్పుడు అతడి గురించి మాట్లాడుకునేవాళ్లం కాదు. అలా రాళ్ల మధ్య పడిపోయిన్ ఫోన్‌ని అందుకోవడం కోసం రాజు కిందకు వంగడం.. రాళ్ల మధ్యలో చిక్కుకుపోడం రెండు ఒకేసారి జరిగాయి. వాటి మధ్య నుంచి బయటకు రావాలని ప్రయత్నించినప్పటికి లాభం లేకుండా పోయింది. ఈ క్రమంలో తనను కాపాడాలంటూ.. ఆర్తనాదాలు చేస్తూ.. సాయం కోసం ఎదురు చూస్తూ.. రాత్రంతా అక్కడే ఉండిపోయాడు. ఇక రాత్రయినా రాజు ఇంటికి రాకపోవడంతో.. అతడి కుటుంబ సభ్యులు కంగారు పడుతూ.. అడవిలోకి వచ్చి గాలించడం ప్రారంభించారు.
అలా వెతుకుతున్న వారికి బుధవారం మధ్యాహ్నం సమయంలో రాళ్ల మధ్యలో నుంచి ఆర్తనాదాలు వినిపించడంతో అక్కడకు వెళ్లి చూడగా.. రాళ్ల మధ్యలో పడిపోయిన రాజు వారికి కనిపించాడు. వెంటనే గ్రామంలోకి వెళ్లి.. కొందరిని తీసుకుని వచ్చి.. రాజును బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. కానీ లాభం లేకపోయింది. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ముందుగా.. రంధ్రం ద్వారా రాజుకు మంచి నీళ్లు.. ఓఆర్‌ఎస్ అందించారు. ఆ తర్వాత అతడిని బయటకు తీసేందుకు ప్రయత్నం చేశారు. కానీ లాభం లేకపోయింది. అనంతరం జేసీబీ, ఫైరింజన్‌ను అక్కడికి రప్పించారు. ఈలోగా చీకటి పడటంతో సహాయ కార్యక్రమాలకు ఇబ్బందిగా మారింది. గుహలో ఇరుక్కుపోయి 24 గంటలుగా నరకయాతన అనుభవిస్తున్న రాజును బయటకు తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరి ఈ ప్రమాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.