ఆ యువతి వయసు 19. సాధారణంగా ఈ వయసులో చాలా మందికి లోక జ్ఞానం కూడా ఉండదు. అయితే సదరు యువతి మాత్రం ఒంటరిగా ప్రపంచాన్నే చుట్టేసింది. 5 నెలల్లో ఓ బుల్లి విమానంలో ప్రయాణిస్తూ ప్రపంచ దేశాలను చుట్టొచ్చింది. దాంతో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఆమె సొంతమైంది. అతి చిన్న వయసులో ప్రపంచాన్ని చుట్టొచ్చిన మహిళగా బెల్జియం కు చెందిన జరా రూథర్ ఫర్డ్ ప్రపంచ రికార్డు నెలకొల్పారు.
ప్రతికూల వాతావర పరిస్ధితులు, అనేక ఇతర సమస్యల మధ్య మొక్కవోని ధైర్యంతో 41 దేశాలను ఒంటరిగా తిరిగి వచ్చారు. కేవలం 155 రోజుల్లో ఏకంగా 52 వేల కిలోమీటర్లు ప్రయాణించారు. విభిన్న ఉష్ణోగ్రతల మధ్య 5 ఖండాల్లోని సుమారు 41 దేశాలను సందర్శించారు. తన సాహస యాత్ర ముగించి స్వదేశంలోకి అడుగు పెట్టిన వెంటనే తల్లిదండ్రులను హత్తుకొని సంతోషాన్ని వ్యక్తం చేశారు జరా రూథర్ ఫర్డ్. జరాకు చిన్నతనం నుంచే పైలట్‌గా రాణించడం కల. అందులోనూ ఆమె తల్లిదండ్రులు కూడా పైలట్‌లే. ఇంకేముంది.. ఆరేళ్లకే చిన్న చిన్న విమానాల్లో ప్రయాణించడం ప్రారంభించింది. 14 ఏళ్లకే సొంతంగా విమానం నడపడంలో ఆరితేరింది.
ఈ క్రమంలోనే ప్రపంచాన్ని ఒంటరిగా చుట్టి రావాలని నిర్ణయించుకుంది. ఆ కలను సాకారం చేసుకునేందుకు 2021 ఆగస్టు 18న శ్రీకారం చుట్టారు జరా రూథర్‌ఫర్డ్. బుల్లి విమానంలో ప్రపంచ యాత్రకు బయల్దేరింది. వాస్తవానికి మూడు నెలల్లోనే ఈ ప్రయాణం పూర్తి కావాలి. కానీ ఐదు నెలల సమయం పట్టింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, వీసా సమస్యల వల్ల రెండు నెలల ఆలస్యంగా 155 రోజుల తర్వాత గురువారం స్వదేశంలోకి అడుగు పెట్టారు. ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు బెల్జియం ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన నాలుగు విమానాలు ఎస్కార్టుగా వచ్చాయి. స్వదేశంలోకి అడుగు పెట్టిన వెంటనే తల్లిదండ్రులను ముద్దాడి తన సంతోషం వ్యక్తంచేశారు సదరు యువతి. ఈ సాహస యాత్రపై మీరు అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.