చనిపోయిన పక్షులు మళ్లీ ప్రాణం వచ్చినట్లుగా గాల్లోకి ఎగిరితే ఎలా ఉంటుంది? ఎగరటమే కాదు.. మనుషులపై గూఢచర్యం చేస్తే ఎలా ఉంటుంది? చనిపోయిన పక్షులు ఏంటి? గాల్లో ఎగురుతూ గూఢచర్యం చేయటం ఏంటని అనుకుంటున్నారా?...
టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత అద్భుతాలు సృష్టించబడుతున్నాయి. సైంటిస్టులు సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నారు. అయితే, చనిపోయిన జీవి ప్రాణాలను తిరిగి తీసుకురావటంలో ఫెయిల్ అవుతూ వచ్చిన సైంటిస్టులు మరో రూపంలో సక్సెస్ సాధించారు. అమెరికాకు చెందిన కొందరు సైంటిస్టులు చనిపోయిన పక్షులకు ప్రాణం పోస్టున్నారు. వాటిని గాల్లో ఎగిరేలా చేస్తున్నారు. వాటి ద్వారా గూఢచర్యం చేస్తున్నారు. చనిపోయిన పక్షులు గాల్లో ఎగురుతూ గూఢచర్యం చేయటం ఏంటని అనుమానం రావచ్చు. మీరు చదువుతోంది నిజమే. కానీ, ఇందులో సైంటిస్ట్‌ల సృజనాత్మకత దాగి ఉంది.
ఇక, పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని న్యూ మెక్సికన్ టెక్‌కు చెందిన ముస్తఫా హస్సనాయిలన్ అనే సైంటిస్ట్‌తో పాటు మరికొంత మంది చనిపోయిన పక్షులను గూఢచర్యం కోసం వాడితే బాగుంటుందని భావించారు. అనుకున్నదే తడువుగా ఇందుకోసం ప్రణాళికలు రచించారు. చనిపోయిన పక్షులను బతికించటం సాధ్యం కాదు కాబట్టి. వాటి శరీరాలను మాత్రమే గూఢచర్యం కోసం వాడాలని డిసైడ్ అయ్యారు. చనిపోయిన తర్వాత కుళ్లిపోకుండా ఉన్న పక్షుల కళేబరాలను సేకరించారు. వాటిలో కొన్ని పరికరాలను జొప్పించారు. కళ్లకు, ఇతర భాగాల్లో కెమెరాలు బిగించారు. పక్షులు ఎలా రెక్కలు కొడతాయి.. ఎలా గాల్లోకి ఎగురుతాయి. గాల్లో ఉన్నపుడు తల, శరీరభాగాలను ఎలా తిప్పుతాయి వంటి వాటిని కోడ్ రాసి దానికి పెట్టారు.
ప్రస్తుతం వాటిని గాల్లోకి పంపి గూఢచర్యం కోసం వాడుతున్నారు. అది కూడా వైల్ట్ లైఫ్ గురించి అంచనా వేయటానికి. దీనిపై న్యూ మెక్సికన్ టెక్‌కు చెందిన ముస్తఫా హస్సనాయిలన్ మాట్లాడుతూ.. ‘‘ ఆర్టిఫియల్ వస్తువులు వాడకుండా చనిపోయిన పక్షుల శరీరాలతో డ్రోన్‌లను తయారుచేస్తున్నాము. కొన్ని విషయాల్లో పకృతే మనకు మార్గం చూపుతుంది. ప్రస్తుతం ఓ రకం పక్షుల డ్రోన్‌లను మాత్రమే వాడుతున్నాం. వాటిని వైల్డ్ లైఫ్‌లో గూఢచర్యం కోసం వాడుతున్నాం. అడవుల్లో ఏం జరుగుతోందో నిఘా పెడుతున్నాం. అవి పక్షుల రూపంలో ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బంది రాదు’’ అని అన్నారు. మరణించిన పక్షులు గాల్లో ఎగురుతూ గూఢచర్యం చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.