ఒలింపిక్స్ కి సంబంధించిన ఏ వార్త అయినా సరే.. ప్రపంచ దేశాలను అలెర్ట్ చేస్తుంది. అన్నీ దేశాలు ఒలింపిక్స్ కి సంబంధించిన ఏ హక్కులనైనా దక్కించుకోవడానికి నానా కష్టాలు పడుతూ ఉంటాయి. ఇందుకు మన దేశం కూడా అతీతం కాదు. అయితే.. ఇప్పుడు ఇండియాకి ఆ అదృష్టం దక్కింది.
ముంబైలో వచ్చే ఏడాది అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ 2023 సెషన్ నిర్వహించేందుకు భారత్ హక్కులు దక్కించుకుంది. 40 ఏళ్ల తర్వాత ఇండియాకి ఈ గౌరవం దక్కడం విశేషం. మన దేశంలో చివరిసారిగా 1983 ఢిల్లీ వేదికగా IOC సెషన్ జరిగింది. ఇప్పుడు.. మళ్లీ ఇన్నాళ్లకు భారత్ ఆ విశిష్ట సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది.
బీజింగ్‌లో జరుగుతున్న 139వ IOC సెషన్‌లో భారత బృందం ఈ మేరకు అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ సభ్యులకు ఓ ప్రెజెంటేషన్ ఇచ్చి, ఈ సమావేశానికి ఒప్పించింది. ఇందులో IOC సభ్యురాలు నీతా అంబానీతో పాటు.., అభినవ్‌బింద్రా, భారత ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నరిందర్ బాట్రా, కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ పాల్గొనడం విశేషం.