కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఎన్ని మందులు వచ్చినా, ఎన్ని వ్యాక్సిన్ లు వచ్చినా.. ప్రజల్లో మాత్రం ఇంకా ఆ భయం పోవడం లేదు. ఓ తల్లి కుమారుడి నుంచి తనకు కరోనా సోకుతుందో అనే భయంతో దారుణానికి ఒడిగట్టింది. 13 ఏళ్ల పిల్లాడిని కారు డిక్కిలో కుక్కి కరోనా టెస్టింగ్ సెంటర్ కు తీసుకెళ్లింది. ఈ ఘటన అమెరికాలో వెలుగులోకి వచ్చింది.
యూఎస్ఏలోని టెక్సాస్ రాష్ట్రం హ్యారిస్ కౌంటీలో నివాసముంటున్న సారా బీమ్ అనే మహిళ, తన 13 ఏళ్ల కుమారుడితో నివసిస్తోంది. అయితే ఆ పిల్లాడికి కరోనా లక్షణాలు ఉండటంతో ఎక్కడ తనకు సోకుతుందోనని భయపడింది. అయితే వ్యాధిని నిర్ధారించుకోవడానికి టెస్టింగ్ సెంటర్ కు వెళ్లాల్సిన పరిస్థితి రావడంతో ఆమెకు ఓ దుర్మార్గపు ఆలోచన వచ్చింది. 13 ఏళ్ల తన కుమారుడిని కారు డిక్కీలో పడుకోబెట్టి టెస్టింగ్ సెంటర్ కు తీసుకెళ్లాలని భావించింది. అనుకున్నట్టుగానే కొడుకును డిక్కిలో కుక్కి నేరుగా టెస్టింగ్ సెంటర్ కు తీసుకెళ్లింది. కారు డిక్కిలో తన కుమారుడు ఉన్నాడని టెస్ట్ చేయాలని అక్కడి సిబ్బందికి చెప్పగా, ఈ విషయం విన్న సిబ్బంది షాక్ అయ్యారు. పిల్లాడిని అందులో నుంచి బయటకు తీయాలని చెప్పినా సారా బీమ్ తీయలేదు. కారు తీసుకొని వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. పోలీసులు ఈ విషయాన్ని హ్యారిస్ కౌంటీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కోర్టు ఆమెపై అరెస్టు వారెంట్ జారీ చేసింది.