సాధారణంగా మనం ఎప్పుడూ డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా? ఆకాశం నుంచి డబ్బు కట్టలు ఏమైనా వచ్చి పడతాయా అనే మాటలు, దెబ్బిపొడుపులు వింటూ ఉంటాం. సగటు మధ్యతరగతి వ్యక్తి సినిమాల్లో, టీవీల్లో అలాంటి సన్నివేశాలను చూసి నా జీవితంలో ఎప్పుడు ఇలా జరుగుతుందో అని అనుకోకుండా ఉండడు. నిజానికి నిజ జీవితంలో అలాంటి ఘటన ఒకటి జరిగింది. కరెన్సీ నోట్లు చిత్తు కాగితాల్లా రోడ్లపై పడ్డాయి. వాటిని ఏరుకునేందుకు హైవేపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా జరిగింది. రోడ్లపై కార్లను ఆపేసి ఎవరికి వాళ్లు తమకే ఎక్కువ సొమ్ము దొరకాలానా రోడ్డుపై నానా తిప్పలు పడ్డారు. అయితే అసలు అలా ఎందుకు జరిగిందో? దాని వెనకున్న అసలు కథేంటో చూద్దాం..
అయితే ఈ ఘటన చిలీ దేశంలోని సాంటియాగోలో జరిగింది. పుడహోయల్లోని క్యాసినోపై శుక్రవారం రాత్రి 7.45 గంటలకు దుండగులు దాడికి పాల్పడ్డారు. ఆ క్యాసినోలోని నగదు మొత్తం బ్యాగుల్లో సర్దుకుని కారులో పారిపోయారు. ఆ దొంగలను పట్టుకునేందుకు పోలీసులు వెంబడించారు. పోలీసులు తరుముతున్న సమయంలో వారి నుంచి తప్పించుకునేందుకు దుండగులు పెద్ద పథకమే వేశారు. కారులో వారి వద్ద ఉన్న డబ్బు సంచులను తీసి డబ్బుని రోడ్డుపై వెదజల్లుతూ వెళ్లారు. ఆ నోట్ల కోసం జనం కార్లు ఆపి దిగాతని.. అలా తప్పించుకోవచ్చని ప్లాన్ చేశారు. నోట్లు గాలిలో తేలుతూ కరెన్సీ నోట్ల వర్షం కురుస్తున్నట్లు కనిపించింది.
రోడ్డుపై వర్షంలా కురుస్తున్న కరెన్సీ నోట్లను ఏరుకునేందుకు జనం ఎగబడ్డారు. హైవే అయినప్పటికీ జనాలు కార్లను రోడ్డుపై ఆపేసి నోట్ల కోసం ఎగబడ్డారు. ఆ కరెన్సీ నోట్ల వర్షం కారణంగా పెద్దఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా అయినట్లుపోలీసులు తెలిపారు. దొంగలు ఎన్ని పన్నాగాలు పన్నినా పోలీసులు వాటిని భగ్నం చేశారు. దుండగులు ప్రయాణిస్తున్న కారుని అడ్డగించి వారిని అరెస్టు చేశారు. పోలీసులు మొత్తం ఆరుగురిని అరెస్టు చేయగా.. అంతా విదేశీయులేనని తేలింది. అంతేకాకుండా వారిలో ఇద్దరు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. అయితే ఈ మొత్తం ఘటనకు సంబంధించి ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని.. గ్యాబ్లింగ్ హాలులో అపహరించిన నగదుని తిరిగి స్వాధీనం చేసుకున్నామని పోలీలులు తెలిపారు. ఈ నోట్ల వర్షానికి సంబంధించిన వీడియో మాత్రం నెట్టింట వైరల్ అవుతోంది.
A violent robbery at a store ended in a police car chase, money raining down on a highway and six suspects getting arrested in Santiago, Chile#chile #santiago #chase #anews pic.twitter.com/KeHtPTQugh
— ANews (@anews) October 21, 2022