పాకిస్థాన్, లాహోర్‌లోని భారతీయ వస్తువులకు ప్రసిద్దిగాంచిన అనార్కలి బజార్ ప్రాంతం బాంబులతో దద్దరిల్లింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. లాహోర్‌లో నిత్యం అత్యంత రద్దీగా ఉండే అనార్కలి బజార్‌లో ఈ బాంబు పేలుడు జరిగింది. మార్కెట్‌కు ఆనుకుని ఉన్న పాన్‌మండి సమీపంలో పార్క్ చేసిన మోటార్‌సైకిల్‌లో పేలుడు పదార్థాన్ని ఉంచినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. పేలుడు జరిగిన ప్రాంతం భారతీయ వస్తువులకు ఫేమస్ గా చెబుతుంటారు.
Another video: viewers discretion advised pic.twitter.com/40RLHqpCKT
— DFI Lite (@DfIlite) January 20, 2022
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, అనేక మోటార్‌సైకిళ్లు, దుకాణాలు మంటల్లో కాలిపోతుండగా, పౌరులు భయంతో సురక్షిత ప్రాంతాలకు పారిపోతున్నారు. పేలుడు ధాటికి సమీపంలోని దుకాణాలు, భవనాల అద్దాలు పగిలిపోయాయి. రెస్క్యూ బృందాలు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించాయి.పెద్ద ఎత్తున భద్రతా బలగాలు అక్కడకి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి.
అయితే పేలుడుకు సంబంధించి ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు. ఉగ్రవాద నిరోధక విభాగం, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పేలుడు జరిగిన తీరును పరిశీలిస్తున్నారు.