ఫిల్మ్ అండ్ స్పోర్ట్స్ డెస్క్- చెన్నైసూపర్ కింగ్స్ సారధి మహేంద్రసింగ్ ధోని ప్రస్తుతం ఐపీఎల్ మెగా వేలం సన్నాహకాల్లో బిజీగా ఉన్నారు. ఇటువంటి సమయంలో ఆయన ఓ సినిమా హీరోతో సమావేశం కావడం ఆసక్తి రేపుతోంది. అవును మహేంద్రసింగ్ దోని ప్రముఖ తమిళ నటుడు చియాన్ విక్రమ్ ను కలిశారు. చియాన్, ధోని బేటీ సాధారణంగానే జరిగిందని ఐపీఎల్ వర్గాలు చెబుతున్నప్పటికీ, అసలు విషయం వేరే ఉందనే చర్చ జరుగుతోంది.
చియాన్ విక్రమ్ తాజాగా నటించిన సినిమా మహాన్ ట్రైలర్ విడుదలైన రోజే ఎంఎస్ ధోని, విక్రమ్ ను కలిశారు. దీంతో మహాన్ మూవీ ప్రమోషన్స్ కోసం ప్లాన్ ప్రకారమే వీరిద్దరు కలిసి ఉంటారని తెలుస్తోంది. మహేంద్రసింగ్ ధోని, విక్రమ్ కలిసిన సందర్భంగా దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
అన్నట్లు మహాన్ లో విక్రమ్ తన కొడుకు ధృవ్ తో కలిసి నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 10న అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవుతోంది. ఇక మహేంద్రసింగ్ ధోని ప్రస్తుతం చెన్నైలోనే ఉంటూ ఐపీఎల్ మెగా వేలంలో అనుసరించాల్సిన వ్యూహాలపై జట్టు యాజమాన్యంతో చర్చలతో బిజీగా గడుపుతున్నారు. ఐపీఎల్ వేలానికి ముందు సీఎస్‌కే.. ధోని సహా నలుగురు ఆటగాళ్లను డ్రాఫ్ట్ చేసుకుంది.
సీఎస్‌కే యాజమాన్యం ధోనిని 12 కోట్లకు డ్రాఫ్ట్ చేసుకోగా, రవీంద్ర జడేజాను అత్యధికంగా 16 కోట్లకు, మొయిన్ అలీని 8 కోట్లకు, రుతురాజ్ గైక్వాడ్‌ను 6 కోట్లకు రీటైన్ చేసుకుంది. ఇక బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఐపీఎల్ 2022 మెగా వేలం జరగబోతోంది. దీంతో ఈ వేలంపై క్రీడాభిమానుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.