హైదరాబాద్ఃవిశాఖపట్నం- మొన్నటి వరకు అడపా దడపా కురుస్తున్న వానలు ఇప్పుడు జోరందుకున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల విస్తారంగా వానలు పడుతున్నాయి. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో, ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల్లో అల్పపీడనం ఏర్పడింది. తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది.
అల్పపీడన ప్రభావంతో వచ్చే రెండు రోజులు ఓ మోస్తరు నుంతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది.
అటు ఉపరితల ధ్రోణి, అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోను వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. తీర ప్రాంత జిల్లాలతో పాటు, కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడతాయని ఐఎండీ స్పష్టం చేసింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. ఇక వర్షాలు మొదలవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. దీంతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.