మనిషన్నాక కూసింత కళాపోషణ ఉండాలని ఓ మహా నటుడు అన్నాడు. కానీ కొంతమంది కూసింతని కొండంత చేసి తమ శరీరాన్ని బాగా పోషించుకుంటూ ఉంటారు. కాయం అంటే వాళ్ళ దృష్టిలో ఒక కళ. ఆ కళని పోషించడాన్నే కాయపోషణ అని వాళ్ళ అభిప్రాయం. కాయపోషణ కోసం అన్నం, వెరైటీ వెరైటీ కూరలు, పండ్లు, స్పైసీ బిర్యానీలు, పిజ్జాలు, బర్గర్లు అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఫుడ్ మార్ట్‌లో సరుకులన్నీ ఇక్కడే కిలోమీటర్ క్యూ కడతాయి. రకరకాల రుచులకు అలవాటుపడ్డ నాలుకకు ఆకులు, పువ్వులు తినమని అంటే సాధ్యమా? సరే ఇవి తినడం పెద్ద గగనమా అని అనుకున్నా, ఇవి మాత్రమే తినడం మాత్రం గగనమే అనాలి. ఎందుకంటే డైలీ అందరూ తినే ఆహారం కాకుండా.. కేవలం ఆకులు, పువ్వులు మాత్రమే తింటూ బతకడం అన్నది అసాధ్యం కాబట్టి. అది కూడా ఏళ్ళ తరబడి ఇదే ఆహారంలో భాగం చేసుకోవడమన్నది మిషన్ ఇంపాజిబుల్ కాబట్టి. కానీ బీహార్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు.
బీహార్ సారణ్ జిల్లాకు చెందిన సంత్ జైశ్రీరామ్‌దాస్.. 12 ఏళ్ళుగా ఆకులు, పువ్వులు మాత్రమే తింటూ జీవనం సాగిస్తున్నారు. పానాపుర్ ప్రాంతంలో ఉంటున్న ఈయన.. ఔషధ గుణాలున్నటువంటి బిల్వ ఆకులు(మారేడు ఆకులు), ఇతర చెట్ల ఆకులు, పుష్పాలు తింటూ జీవనం సాగిస్తున్నారు. ఇతన్ని అక్కడి వారంతా బేల్‌పతి బాబాగా కొలుస్తున్నారు. శ్రావణ మాసంలో బిల్వ పత్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శివుడికి కూడా ఈ బిల్వ పత్రమంటే ఎంతో ప్రీతి. శివుడి భక్తుడైన సంత్ జైశ్రీరామ్‌దాస్ కూడా ఈ బిల్వ పత్రాలను ఎంతో ఇష్టంగా తింటారు. ఎండు మిరపకాయలతో హోమం నిర్వహించడం ఈ బాబా ప్రత్యేకత. శ్రావణ మాసంలో మూడు రోజుల పాటు ఈ హోమం నిర్వహిస్తారు. విశ్వాన్ని రక్షించేందుకే ఈ హోమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఆకులు, పువ్వులు తింటూనే జీవిస్తున్న ఆయన.. ఇప్పటివరకూ తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తలేదని అంటున్నారు. ఆధ్యాత్మిక మార్గాన్ని పాటించడం వల్లే తనకి ఇది సాధ్యపడిందని ఆయన చెప్పుకొచ్చారు. మరి కేవలం ఆకులు, పువ్వులు మాత్రమే ఆహారంగా తీసుకుని జీవిస్తున్న సంత్ జైశ్రీరామ్‌దాస్‌పై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.