ఈ మధ్యకాలంలో ఆచారాలు, సాంప్రదాయాలు పాటించేవారు చాలా తక్కువగా ఉన్నారు. విలువలతో, మానవతా దృక్పథంతో మెలిగేవారు కరువయ్యారు. అలాంటిది ఓ ఊరిలో ఆచారాలకు, సాంప్రదాయాలను గౌవరవిస్తున్నారు. మనకు ప్రాథమిక అవసరాలతో పాటు కాళ్ళకు చెప్పులు కూడా చాలా అవసరం . అయితే ‘వేమన ఇండ్లు’ అనే గ్రామంలో ఏకంగా ఊరంతా చెప్పులు లేకుండా ఆచార, సాంప్రదాయాలను కాపాడుకుంటున్నారు.
ప్రస్తుత కాలంలో ఆచారాలు, సాంప్రదాయాలు పాటించేవారు చాలా తక్కువ. అన్ని విషయాలలో తమకు అనుకూలంగా మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు. ఒంటికి బట్టలు వేసుకోవడం ఎంత ముఖ్యమో కాళ్లకు చెప్పులు వేసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే కాళ్లకు చెప్పులు లేకుంటే రాళ్లు, ముల్లు, సీసం పెంకులు గుచ్చుకపోతాయి. అందుకే కాళ్లకు రక్షణగా మనం చెప్పులు వేసుకుంటాం. ఈ రోజుల్లో కాళ్లకు చెప్పులు లేకుండా రెండు నిమిషాలు కూడా నడవలేం. కొందరైతే ఇంట్లో కూడా చెప్పులు వేసుకుంటారు. అలాంటిది ఏకంగా ఓ ఊరు మొత్తం చెప్పులు లేకుండా తిరుగుతారు. ఆ ఊరిపేరు ఏంటనుకుంటున్నారా? ఆ ఊరి పేరు ‘వేమన ఇండ్లు’. ఈ ఊరిలో అందరు ఆచారాలకు, సాంప్రదాయాలకు విలువనిస్తారు. ఈ ఊరు తిరుపతి జిల్లా పాకాల మండలం ఉప్పరపల్లి పంచాయతీ పరిధిలో ఉంది.
ఈ గ్రామస్తులంతా ‘పాలవేకరి’ కులస్తులుగా, దొరవార్లుగా చెప్పుకుంటారు. వీరంతా వెంకటేశ్వర స్వామి ఆలయంలో రోజుకో కుటుంబం పూజలు చేస్తుంటారు. ఆ గ్రామంలో ఉన్న వారందరూ ఒకే వంశం వారు. కొత్తవారు బంధుత్వం కలుపుకున్నా సరే వారికి సంబంధించిన వారినే ఎన్నుకుంటారు. వేమన ఇండ్లు గ్రామానికి ఎవరు కొత్తవారు వచ్చినా.. ఊరి బయటే వారి చెప్పులు వదిలి రావలసి ఉంటుంది. చివరకు కలెక్టర్ వచ్చినా ఊరి ఆచార, సాంప్రదాయాలు పాటించాల్సిందే. గ్రామస్తులు పాఠశాలలకు, కాలేజీలకు, ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్నవారైనా సరే ఆచార, సాంప్రదాయాలను పాటించాల్సిందే అంటున్నారు స్థానికులు.
వేమన ఇండ్లకు చెందిన గ్రామస్తులు వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే, తమ భోజనం, నీళ్లు తమతో తీసుకెళతారు. అంతేకానీ బయటి తిండి ముట్టరు. బయటి నుండ ఇంటికి రాగానే స్నానం చేసి బట్టలు మార్చుకోనిదే గడప దాటరు. గ్రామస్తులందరు చిన్నా, పెద్దవారు అందరు చల్లనీళ్లతోనే స్నానం చేస్తారు. ఆడవారికి నెలసరి దినాల్లో ప్రత్యేకంగా ఉంచుతారు. గ్రామంలోని మహిళలు నెలసరి రోజుల్లో ఉండడానికి ఊరికి అవతల వైపు రెండు పక్కాఇళ్లను నిర్మించారు. వారి పీరియడ్స్ అయిపోయేవరకు అక్కడే ఉండాలి. అప్పటివరకు ఇంటి పెద్దాయనే వంటావార్పు చేసుకుని.. మహిళలకు తీసుకెళ్లి ఇస్తారు. గ్రామస్తులకు జబ్బు చేసినా.. గర్భిణులు సైతం ఆస్పత్రులకు వెళ్లినట్లు వారికి తెలియదని స్థానికులు చెబుతున్నారు. కరోనా సమయంలో కూడా వీరెవరూ ఆస్పత్రికి వెళ్లలేదు, కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోలేదంటున్నారు.