హైదరాబాద్- గత కొన్ని రోజులుగా తన రాజకీయ భవితవ్యంపై ఉగిసలాడుతున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ చేశాక ఆయన అనుచరులు, కార్యకర్తలతో మంతనాలు జరుపుతూ వస్తున్నారు. తెలంగాణలో వివిధ పార్టీల ముఖ్య నేతలతో చర్చలు జరిపారు. ఐతే ఇప్పటి వరకు ఏ పార్టీలో జాయిన్ అవ్వాలన్నదానిపై ఎటూ తేల్చుకోలేకపోయారు. ఈ నేపధ్యంలో ఈటల రాజేందర్ తో బీజేపీ పార్టీ సంప్రదింపులు జరుపుతోంది. ఈ మేరకు బీజేపీ జాతీయ నాయకుడు భూపేందర్ యాదవ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కలిశారు. హైదరాబాద్ నగర శివారులోని ఓ ఫామ్‌హౌజ్‌లో ఈ సమావేశం జరిగింది. ఈటలను బీజేపీ పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. కమలం పార్టీలోకి వస్తే కీల పదవి కూడా కట్టబెట్టేందుకు సిద్దంగా ఉన్నామని కిషన్ రెడ్డి ఈటలకు హామీ ఇచ్చినట్లు సమాచారం.
ఐతే బీజేపీలో చేరికపై మాత్రం ఈటల రాజేందర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ముందు టీఆర్ ఎస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. రాజీనామా తరువతా హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలిచి తన సత్తా ఎంటో చూపించాలని ఈటల తహతహలాడుతున్నారట. అందుకే రాజీనామా, ఉప ఎన్నిక తరువాతే ఏ పార్టీలో చేరే అంశంపై ఆలోచిస్తానని సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానిస్తున్నారు ఈటల. దీంతో ఇప్పుడు ఈటల రాజేందర్ వ్యవహారం రాజకీయవర్గాల్లోఆసక్తి రేపుతోంది. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఎవరిని బరిలోకి దించాలన్నదానిపై అధికార టీఆర్ ఎస్ పార్టీ సైతం సమాలోచనలు చేస్తోందట.