పొలిటికల్ డెస్క్- మాజీ మంత్రి, హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక రాబోతోంది. నిబంధనల మేరకు ఆరు నెలల్లోపు హుజూరాబాద్ కు ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. దీంతో ఈటలను ఓడించి, మళ్లీ హుజూరాబాద్ నియోజకవర్గాన్ని టీఆర్ ఎస్ ఖాతాలో వేసుకోవాలని సీఎం కేసీఆర్ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈమేరకు ఇప్పటి నుంచి ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్తున్నారు ముఖ్యమంత్రి. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఈ ఎన్నికపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది.
హుజురాబాద్ అభివృద్దిపై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ పలు అంశాలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా హుజూరాబాద్ మున్సిపాలిటీకి 35 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు విడుదల చేస్తూనే, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సంక్షేమ పథకాలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. హుజూరాబాద్ పట్టణంలోని ప్రజల త్రాగునీటి అవసరాల కోసం 10.52 కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అంతే కాదు హుజూరాబాద్ పట్టణంలోని వివిధ వార్డుల్లోని అభివృద్ధి పనుల కోసం 25 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది.
నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వీలైనంత తొందరగా మొదలుపెట్టి, పనులను పూర్తి చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. అభివృద్ది పనులన్నింటిని ఒకటిన్నర నెలల్లో పూర్తి చేసేలా ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణకు స్పెషల్ ఆఫీసర్లను నియమించాలని కలెక్టర్ ను ఆదేశించారు మంత్రి. ఎన్నికల లోపు అభివృద్ది కార్యక్రమాల ద్వార ఓటర్లను తమవైపుకు తిప్పుకోవాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది.