కరీనంగర్- తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ ప్రజల చెమట సొమ్మేనని మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో తన గెలుపు ఖాయమని, నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగురుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తనకు కుల మతాలతో సంబంధం లేదన్న ఈటల, తన తొలి ప్రాధాన్యత కార్యకర్తలకేనని తేల్చి చెప్పారు. ఆర్థిక అంశాలతో పాటు ఆత్మ గౌరవం కూడా ముఖ్యమని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. హుజురాబాద్ లో జరిగిన బీజేపీ సమావేశంలో ఈటల రాజేందర్ తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా టీఆర్ ఎస్ ప్రభుత్వంపై ఈటల రాజేంర్ విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ఎలాంటి పాలన కొనసాగుతుందో ప్రజలందరికీ తెలుసుని అన్నారు. తెలంగాణ ప్రజలను అడుక్కునే వారిగా మార్చే పాలన సాగుతోందని ఈటవ ఆరోపించారు. ఇక ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం చూసి సీఎం కేసీఆర్ భయపడుతున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఇంకా చాలా మంచి నేతలు, కార్యకర్తలు బీజేపీలో చేరేందుకు రేడీ ఉన్నారని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమకారులను కొట్టినవాళ్లు ఈ రోజు కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రులుగా కొనసాగుతన్నారని బండి సంజయ్ మండిపడ్డారు.
తెలంగాణలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి నిధులన్నీ కేంద్ర ప్రభుత్వానివేన్న సంజయ్. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ వాటా లేకుండా ఎన్ని నిధులు కేటాయించారో స్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక మీడియా సమావేశంలో ఈటల రాజేందర్ పొరపాటున నోరు జారారు. హుజురాబాద్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని చెప్పాల్సిన ఈటల, అలవాటులో పొరపాటుగా హుడూరాబాద్ లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్నవాళ్లంతా కాసేపు అవాక్కయ్యారు. ఈ తప్పును గమనించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వారించడంతో తన తప్పును గుర్తించిన ఈటల రాజేందర్ హుజూరాబాద్ లో ఎగిరేది కాషాయం జెండా అని చెప్పారు. పార్టీ మారిన కొత్తలో ఇదంతా సహజమేనన్న కామెంట్స్ అక్కడ వినిపించాయి.