హైదరాబాద్- తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ చెదురు మదురు ఘటనలు మినహా ప్రశాంతంగానే ముగిసింది. బీజేపీ పార్టీ నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్, అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నుంచి బల్మూరి వెంకట్ హుజూరాబాద్ ఎన్నికల బరిలో ఉన్నారు. నవంబర్ 2న హుజూరాబాద్ ఎన్నిక ఫలితం వెలువడనుంది. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారన్నదానిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. హుజూరాబాద్ ఓటర్లు ఏ పార్టీకి పట్టం కట్టనున్నారన్నది ఉత్కంఠ రేపుతోంది. ఐతే ఎగ్జిట్ పోల్స్ మాత్రం హుజూరాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుస్తారని చెబుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించిన ఆరు సంస్థల్లో ఐదు సంస్థలు బీజేపీదే హవా అని తేల్చి చెప్పాయి.
హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబందించి టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య 7 నుంచి 10 శాతం ఓట్ల తేడా ఉన్నట్లు సర్వే సంస్థలు అంచనా వేశాయి. ఈ ఉప ఎన్నికలో కీలక నేతగా ఈటల ఇమేజ్ పనిచేసిందని చెబుతున్నారు. ఈటల రాజేందర్ ను బీజేపీ అభ్యర్థిగా కాకుండా ఆయనను వ్యక్తిగతంగా చూసే ఓటు వేసినట్లు సర్వే సంస్థలు స్పష్టం చేశాయి. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలతో సత్సంబంధాలను కలిగి ఉండటం, ప్రజలకు సేవాభావంతో పనిచేయడం వంటి అంశాలు ఆయనకు కలిసి వచ్చాయని పేర్కొన్నాయి.
మరోవైపు ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి తొలగించిన సానుభూతి పనిచేసిందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఈటలకు నిరుద్యోగులు, యువత అండగా నిలచినట్లు చెబుతున్నారు. ఐతే ఒక్క సర్వే సంస్థ మాత్రం హుజూరాబాద్ లో టీఆర్‌ఎస్ దే పైచేయి సాధించనున్నట్లు పేర్కొంది. మరి హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారో అన్నది తేలాలంటే మాత్రం నవంబర్ 2వరకు ఆగాల్సిందే.