హైదరాబాద్- జమున హ్యాచరిస్, గోదాంలపై ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేస్తుందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ భార్య ఈటల జమున ఆరోపంచారు. అసత్య ప్రచారాలను తిప్పికొట్టడం ఎలాగో తెలుసని ఆమె అన్నారు. ఎవరిని మోసం చేయలేదని, కష్టపడి పైకి వచ్చామని వ్యాఖ్యానించారు. ముసాయి పేటలో 46 ఎకరాలు కొన్నామని, కొన్నదాని కంటే ఒక ఎకరా భూమి ఎక్కువగా ఉన్న ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు జమున. మరి మీ ఆరోపణలు అబద్దమని తేలితే మీరు ముక్కునేలకు రాస్తారా అని ప్రశ్నించారు. ఇక దేవర యాంజల్ భూములు 1994 లో కొనుగోలు చేశామని ఆమె చెప్పారు. తమ గోదాములు ఖాళీ చేయించాలని, ఆర్థిక వనరులు దెబ్బ కొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. అసత్య ప్రచారాలు ఎక్కువ రోజులు నిలవన్న జమున, రావల్ కోల్ భూముల్లో లాజిస్టిక్ పార్క్ పెడతామని వారికి చెప్పి కొన్నాం, అప్పుడు తెలియదా అని ప్రశ్నించారు.
ఎవరు ఎన్ని కుట్రలు చేసిన భయపడేది లేదని ఈటల జమున తేల్చి చెప్పారు. తాము ఎవరికి అన్యాయం చేయలేదన్న జమున, చివరికి న్యాయం గెలుస్తుందని, ధర్మమే నిలబడుతుందని వ్యాఖ్యానించారు. జమున హేచరీష్ పై సర్వే చేయవద్దని చెప్పలేదని, తమ సమక్షంలో సర్వే చేయమని చెప్పామని ఆమె గుర్తు చేశారు. తాను పౌల్ట్రీ ని నడిపితేనే తెలంగాణ ఉద్యమం నడిచిందన్న జమున, వంట వార్పు చేసి.. ఉద్యమకారులకు అండగా నిలిచామని చెప్పారు. తమ్ముడు తమ్ముుడు అంటూనే కేసీఆర్ తన భర్త ఈటల రాజేందర్ ను తడి బట్టతో గొంతు కోశారని ఫైర్ అయ్యారు. స్కెచ్ వేసి రాత్రికి రాత్రి పోలీసులను పెట్టి భయ భ్రాంతులకు గురి చేశారని ఆవేధన వ్యక్తం చేశారు. కేసీఆర్ కి న్యాయం లేదు, ధర్మం లేదని, ఆయన చెప్పింది రాత్రికి రాత్రి కావాలని అనుకుంటున్నారని జమున అన్నారు.
సమైక్య పాలనలో కూడా ఇటువంటి పరిస్థితి లేదన్న ఆమె, తెలంగాణ వచ్చాక ఇప్పుడు సమాజాన్ని కులాలతో విభజన చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని కులాల వారు ఉద్యమం చేస్తేనే తెలంగాణ వచ్చిందిని వ్యాఖ్యానించారు. తెలంగాణ వచ్చాక అవమానాలు పెరిగాయన్న జమున, సమైక్య పాలనలోనే సంతోషంగా ఉన్నామని అన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవం కోసం పనిచేస్తామని, టక్కు టమారాలు, గోకర్ణ విద్యలు నడవవని తేల్చి చెప్పారు. పోలీసులతో తమను భయపెట్టాలని చూస్తే, ఎట్టి పరిస్థితుల్లోను భయపడేది లేదని అన్నారు. మా ఆస్తులు పోయినా, మళ్లీ కష్ట పడి సంపదిస్తామనే ధైర్యం ఉందని వ్యాఖ్యానించారు.