అనంతపురం- నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా.. ఈ పాట తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి క్రేజ్ ని క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో కొత్త పెళ్లి కూతురు పెళ్లి బారాత్ లో బుల్లెట్టు పాటపై చేసిన డ్యాన్స్ అంతా ఇంతా పాపులర్ కాలేదు. ఆమె డ్యాన్స్ వీడియో యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో కోట్లాది వీవ్స్ వచ్చాయి.
ఇక అక్కడి నుంచి చాలా వరకు పెళ్లిళ్లలో పెళ్లి కూతుర్లు బుల్లెట్టు బండి పాటకు డ్యాన్స్ చేయడం పరిపాటిగా మారింది. అలా ఈ పాట తెలుగు రాష్ట్రాల్లో ఓ కొత్త ట్రెండ్ సృష్టించింది. ఇప్పటి వరకు పెళ్లి కూతుర్లు, ఆడవాళ్లు మాత్రమే డ్యాన్స్ చేసిన బుల్లెట్టు బండి పాటకు ఓ పోలీసు అధికారి స్టెప్పులేయడం ఆసక్తికరంగా మారింది. ఏకంగా ఓ జిల్లా ఎస్పీ బుల్లెట్టు బండి పాటకు డ్యాన్స్ చేసి ఔరా అనిపించారు. ఎస్పీ డ్యాన్స్ అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం ఎస్పీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తాపా అంటూ డుగ్గు డుగ్గు పాటకు స్టెప్పులేశారు. అనంతపురం జిల్లా పోలీసులు వీక్లీ ఆఫ్ లో భాగంగా కంబదూరు మండల కేంద్రంలోని రామప్పబండ వద్ద గురువారం కార్తీక వన భోజన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసు కుటుంబాలకు చెందిన పిల్లా పెద్దలంతా ఉత్సాహంగా గడిపారు.
ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప కాగినెల్ల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసులతో పాటు వారి కుటుంబ సభ్యులు, పిల్లలు కూడా రావడంతో సందడి వాతావరణం నెలకొంది. దీంతో ఎస్పీ మైక్ పట్టుకుని పాటలు పాడుతూ అందర్నీ ఉత్సాహ పరిచారు. అంతే కాదు బల్లెట్టు బండి పాటకు డ్యాన్స్ కూడా చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ఎస్పీ డ్సాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.