అమరావతి- ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చే సార్వత్రిక ఎన్నికలపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. 2024 సాధారణ ఎన్నికల్లో అధికారంలోకి రాకపోతే పార్టీ పూర్తిగా విఛ్చిన్నం అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లె గెలుపే లక్ష్యంగా ప్రాణాళికలు సిద్దం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని జల్లెడ పడుతూ పార్టీని గెలిపించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు. పార్టీ ఇన్‌చార్జి లేని నియోజకవర్గాలపై సైతం చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. ఇక చంద్రబాబుకు పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడం ఒక సవాల్ అయితే, తన కంచుకోట అయిన చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గాన్ని మరోసారి నిలబెట్టుకోవడం రెండో సవాల్ గా మారింది.
1989 నుంచి ఇప్పటి వరకు కుప్పంలో ఓటమి ఎరుగని నాయకుడిగా చంద్రబాబు రికార్డు సృష్టించారు. కానీ ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో టీడీపీ ఘోర పరాజయం పాలైంది. దీంతో ప్రత్యర్ధి పార్టీ వైసీపీలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ క్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈసారి కుప్పంలో చంద్రబాబును ఎలాగైనా ఓడిస్తామని, వైసీపీ జెండా ఎగరేస్తామని సవాల్ విసురుతున్నారు. దీంతో చంద్రబాబు కుప్పంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
ఇదే సమయంలో గత ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఓడిపోయిన కుమారుడు నారా లోకేష్‌ను ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిపించుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుపై పడింది. లోకేష్‌ను ఈసారి ఎలాగైనా అసెంబ్లీ పంపేందుకు చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు కూడా ఆపార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. లోకేష్‌ను వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి పోటీ చేయించి.. చంద్రబాబు మంగళగిరి అసెంబ్లీ బరిలోకి దిగుతారని పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
కుప్పం నియోజకవర్గం చంద్రబాబుకు కంచుకోట. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అక్కడ గట్టిగా ఫోకస్ చేసి తెలుగుదేశం పార్టీని ఓడించింది. కానీ 2024 ఎన్నికల నాటికి అక్కడ పార్టీ బలోపేతం అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఇదే సమయంలో లోకేష్ యువకుడు కావడం కూడా కుప్పంలో పార్టీకి ప్లస్ అవుతుందని అనుకుంటున్నారు. గుంటూరు జిల్లాలలో ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చంద్రబాబు పోటీ చేస్తే ఈ రెండు జిల్లాల్లో పార్టీకి కలిసివస్తుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.