చెన్నై- బిజినెస్ అందరూ చేస్తారు. కానీ కొందరు విభిన్నంగా ఆలోచించి వ్యాపారం చేసి సక్సెస్ అవుతారు. అందరిలా కాకుండా కాస్త కొత్తగా చేస్తే ఏ బిజినెస్ లో అయినా రాణించవచ్చు. కానీ ఒక్కోసారి వినూత్నంగా ఆలోచించినా అది కాస్త మిస్ ఫైర్ అవ్వవచ్చు. చెన్నైలో ఓ హోటల్ యజమాని ఇలాగే కొత్త ఐడియాతో ఓ ఆఫర్ ప్రకటించి బోల్తా పడ్డాడు. ఇంతకీ ఏంజరిగిందంటే..
చెన్నైలోని ఓ ప్రముఖ బిర్యాని హోటల్ యాజమాన్యానికి ఓ ఐడియా తట్టింది. తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు ఓ ఆఫర్ ను ప్రకచించారు. అదేంటంటే.. కేవలం ఐదు పైసలకే బిర్యాని అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఈ కాలంలో ఐదు పైసలు ఎవరి దగ్గర ఉంటాయిలే అని బిర్యాని హోటల్ యజమాని అనుకున్నారు. ఒకరిద్దరి దగ్గర 5 పైసల నాణెం ఉన్నా పరవా లేదు, వారికి బిర్యాని ఇచ్చినా నష్టం లేదు, కానీ పబ్లిసిటీ మాత్రం బాగా వస్తుందని భావించారు.
కానీ సీన్ రివర్స్ అయ్యింది. ఐదు పైసలకే బిర్యాని అన్న ప్రకటన చూసి జనం ఎగబడ్డారు. అందరు 5 పైసల నాణేలు తీసుకుని వచ్చారు. దీంతో సదరు బిర్యాని హోటల్ యజమాని బిత్తరైపోయాడు. మొదటి వచ్చిన పది, పదిహేను మందికి ఐదు పైసలకే బిర్యాని ఇచ్చి, ఆ తరువాత బిర్యాని ఐపోయిందని హోటల్ ను మూసేశారు. ఐనప్పటికీ జనం మాత్రం అక్కడి నుంచి కదల్లేదట. చాలా సేపటి వరకు తమకు బిర్యాని కావాలని డిమాండ్ చేశారు.
దీంతో ఏంచేయాలో తోచక, కాసేపు వేయిట్ చేసి, ఇక లాభం లేదనుకుని వెనక డోర్ నుంచి జారుకున్నారు బిర్యాని హోటల్ యజమాని, సిబ్బంది. అనుకున్నది ఒకటైతే, అయ్యింది ఒకటంటే ఇదే కాబోలు. చిన్న ఐడియాతో హోటల్ కు మంచి ప్రచారం వస్తుందనుకుంటే, ఇలా జరిగిందేమిటిరా అని తల పట్టుకున్నాడు హోటల్ యజమాని.