న్యూ ఢిల్లీ- భారత్ లో ఇప్పటి వరకు మొత్తం 16 కోట్ల 50 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఎవయసు వారికి ఎంత మేర టీకా వేశారన్నదానిపై కేంద్రం వివరాలు వెల్లడించింది. 60 ఏళ్లు పైబడిన వారికి ఇప్పటి వరకు 41 శాతం కరోనా టీకా వేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. 45 నుంచి 60 సంవత్సరాల వయస్సు గలవారు ఇందులో 46 శాతం మంది ఉన్నారని తెలిపింది. ఇక 30 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు 9 శాతం, 18 నుంచి 30 సంవత్సరాల వయస్సు గలవారు 4శాతం వాటా కలిగి ఉన్నారని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్న నేపద్యంలో కొవిడ్ కట్టడికి మోదీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఈమేరకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు యుద్దప్రాతిపదికన ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే మూడు కంపెనీల వ్యాక్సిన్ లకు అనుమతి ఇచ్చిన కేంద్రం.. మరో రెండు కంపెనీల వ్యాక్సిన్ లకు అనమతి ఇచ్చేందుకు సిద్దమవుతోందని సమాచారం. త్వరితగతిన టీకా కార్యక్రమాన్ని పూర్తి చేస్తే కరోనా కేసులను కట్టడి చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.