చెన్నై- తమిళనాడు నూతన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన మార్క్ పాలన చూపిస్తున్నారు. ప్రతి పక్షాలను సైతం కలుపుతుపోతూ కొత్త తరహా సంప్రదాయానికి తెరతీశారు స్టాలిన్. అధికారం చేపట్టగానే సంక్షేమంపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి, అప్పుడే ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. ఇక తమిళనాడు ఆర్ధిక పరిస్థితులను మెరుగుపరిచేేందుకు నడుం బిగించారు సీఎం స్టాలిన్. ఇందుకోసం ప్రత్యేకంగా ఆర్ధిక సలహా మండలిని ఏర్పాటు చేశారు. ఈ సలహా మండలి సభ్యులుగా రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్ తో పాటు ఎస్తేర్ డుఫ్లో, అరవింద్ సుబ్రమణియన్, సామాజిక శాస్త్రవేత్త జీన్ డ్రేజే, కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ కార్యదర్శి ఎస్ నారాయణ్ ఉన్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఆర్ధిక, సామాజిక విధానాలపై ఈ కౌన్సిల్ సలహాలు, సూచనలు చేయనుంది.
తమిళనాడులో ఆర్థిక ప్రగతి మందగించిందని, దాన్ని అదిగమించేందుకు ఆర్థిక సలహా మండలి ఏర్పాటు చేస్తున్నట్లు తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ స్పష్టం చేశారు. మసాచుసెట్స్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ప్రొఫెసర్, నోబెల్ గ్రహీత ఎస్తర్ డుఫ్లో వంటి ప్రపంచస్థాయి ఆర్ధిక వేత్తలను కౌన్సిల్‌లో సభ్యులుగా నియమించడం స్టాలిన్ దూరదృష్టికి నిదర్శనమని చెప్పవచ్చు. తమిళనాడు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి నిరంతర అధిక ఆదాయాలు ద్రవ్య లోటు, పెద్ద మొత్తంలో అప్పులతో ప్రమాదకరంగా ఉంది. అదే సమయంలో ప్రజల అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వేగవంతమైన ఆర్థిక వృద్ధి, సామాజిక న్యాయం, సమానత్వాన్ని ప్రభుత్వం అందజేయనుంది.. అని ప్రభుత్వం ఓ ప్రకటన జారీ చేసింది.
ఆర్ధిక, సామాజిక న్యాయం, మానవాభివృద్ధి సంబంధిత అంశాలు, ప్రధానంగా మహిళలు, బలహీన వర్గాలకు సమాన అవకాశాలపై సాధారణ మార్గదర్శకాలను ఈ సలహా మండలి అందజేస్తుందని ప్రభుత్వం పేర్కొంది. అన్ని రంగాల్లో వృద్ధి, ఉద్యోగ కల్పన, ఉత్పత్తి పెంపునకు సలహాలు, అలాగే అభివృద్ధి నిరోధకాలకు పరిష్కారాలను సూచించే బోర్డు గానూ ఈ సలహా మండలి వ్యవహరించనుందని స్టాలిన్ సర్కార్ పేర్కొంది. ఇక ఈ ఆర్ధిక సలహా మండలి అవసరం మేరకు వ్యక్తిగతంగా, కొన్ని సందర్బాల్లో వర్చువల్ గా సమావేశమవుతుంది. దాని లక్ష్యాలను సాధించడానికి స్వంత కార్యాచరణ పద్ధతులను నిర్దేశించుకుంటుంది.