హైదరాబాద్-శ్రీశైలం- కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలంలో పర్యటించారు. కుటుంబ సమేతంగా ఆయన శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు. అమిత్ షా కుటుంబ సభ్యులతో పాటు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 11.15 గంటలకు హైదరాబాద్ లోని బేగంపేట్ ఎయిర్ పోర్ట్ కు వచ్చారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో సున్నిపెంటకుచేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వార శ్రీశైలం వెళ్లారు.
శ్రీశైలం పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దేవాదాయ శాఖ కమిషనర్ వాణి మోహన్, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, ఆలయ అర్చకస్వాములు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. భ్రమరాంబ మల్లిఖార్జున స్వామిని దర్శించున్న తరువాత, ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు చేశారు.
స్వామివారి దర్శనానంతరం ఆలయ అధికారులు అమిత్ షాకు మల్లికార్జున స్వామి, భ్రమరాంభ అమ్మవార్ల చిత్ర పటాన్ని బహూకరించారు. స్వామి వారిని దర్శనం చేసుకున్న అనంతరం దేవస్థానం అతిథి గృహంలో అమిత్ షా కుటుంబంతో కలిసి భోజనం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన అంతా సర్‌ప్రైజ్‌గా సాగింది. ఎందుకంటే ఇది పూర్తిగా ఆయన వ్యక్తిగత పర్యటనగా భావించాలి.
అమిత్ షా పర్యటన సందర్భంగా ఆలయ పరిసరాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అమిత్ షా శ్రీశైలం పర్యటన సమాచారం ఒక్క రోజు ముందు మాత్రమే బయటకు వచ్చింది. శ్రీశైలం ప్రాంతం ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోటగా ఉండేది. అందుకే అమిత్ షా పర్యటన వివరాలను ముందుగా బహిర్గతం చేయలేదని తెలుస్తోంది. తిరిగి హెలికాప్టర్ లో హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా, ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.