న్యూ ఢిల్లీ- టాలీవుడ్, బాలీవుడ్ సినీ నటీనటులు ఇప్పటికే డ్రగ్స్ కేసును ఎదుర్కొంటుండగా, మరో కేసులో ఇరుక్కున్నారు. అవును 2019లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య కేసులో తెలుగు సినీ తారలపై కేసులు దాఖలు చేయాలని కోర్టులో పిటీషన్ దాఖలైంది. దీంతో మరోసారి దిశ హత్య చేసు తెరపైకి వచ్చింది. 2019లో హైదరాబాద్ శివారు ప్రాంతమైన శంషాబాద్ లో కిడ్పాప్ కు గురైన దిశ, షాద్ నగర్ లో అత్యాచారానికి గురైంది.
అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆ కేసుకు సంబంధించి చాలా మంది ప్రముఖలు ట్వీట్లు, పోస్టులు చేశారు. ఈ క్రమంలో బాధితురాలి అసలు పేరును చాలామంది ట్వీట్లు, పోస్టలో పేర్కొన్నారు. చట్టరిత్యా అత్యాచార బాధితురాలి పేరు, ఊరు తెలిపేలా ఎవరూ మాట్లాడకూడదు. కానీ అప్పుడు దీన్ని ఎవరు పట్టించుకోలేదు. సెలబ్రిటీలు ఆమె పేరును ట్విట్టర్ పోస్టుల్లో రాసుకొచ్చారు.
అందుకే వారందరిపై కేసులు నమోదు చేయాలని దిల్లీ తీస్ హజారీ కోర్టులో న్యాయవాది గౌరవ్ గులాటీ పిటిషన్ దాఖలు చేశారు. ఇక గౌరవ్ గులాటీ తన పిటిషన్‌లో మొత్తం 38 మంది పేర్లను ప్రస్తావించారు. సెక్షన్ 228ఏ కింద ప్రముఖులపై కేసు నమోదు చేయాలని సబ్జీమండీ పోలీసు స్టేషన్లో కంప్లైంట్ కూడా చేశారు గౌరవ్. దానిని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.
ప్రధానంగా ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవ్గన్, అభిషేక్ బచ్చన్, ఫరాన్ అక్తర్, అనుపమ్ ఖేర్ తో పాటు, టాలీవుడ్ నటులు రవితేజ, అల్లు శిరీష్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, నటి ఛార్మి పేర్లు ఈ కేసులో ఉన్నాయి. దీంతో మరోసారి దశ కేసు తెరపైకి రావడంతో బాలీవుడ్, టాలీవుడ్ నటీ నటుల ప్రస్తావన రావడం సంచలనంగా మారింది.