ఫిల్మ్ డెస్క్- ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ ఇక లేరు. కాసేపటి క్రితం ఆయన మరణించారు. చాలా కాలంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న దిలీప్ కుమార్ బుధవారం ఉదయం కన్నుమూశారు. దిలీప్ కుమార్ కు 98 ఏళ్ల వయసు. ముంబైలోని హిందూజ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 07.30కి తుది శ్వాస విడిచారు.
దిలీప్ కుమార్ చాలా కాలంగా శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. గత నెలలో చాలా సార్లు ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. అంతకు ముందు కరోనా నుంచి కోలుకున్ననప్పటికీ ఇతర అనారోగ్య సమస్యలతో ఇంబ్బంది పడ్డారు. గత వారం దిలీప్ కుమార్ ఆరోగ్యం క్షీణించడంతో ముంబై శివారులోని హిందూజ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు.
దిలీప్ కుమార్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన భార్య సైరా భాను సోమవారం తెలిపారు. మీ అందరి ప్రార్థనల వల్ల దిలీప్ కుమార్ త్వరలోనే డిశ్చార్జి అవుతారని నమ్ముతున్నానని ఆమె అన్నారు. కానీ అంతలోనే ఆయన ఆరోగ్యం విషమించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 7 గంటల 30 నిమిషాలకు దిలీప్ కుమార్ తుది శ్వాస విడిచారు.
దిలీప్ కుమార్ ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న పెషావర్లో 1922లో డిసెంబర్ 1న జన్మించారు. ఆయన అసలు పేరు మహమ్మద్ యూసుఫ్ ఖాన్. 1944లో జ్వర్ భాటా సినిమా ద్వారా సినిమాల్లోకి రంగప్రవేశం చేశారు. అప్పటి నుంచీ దిలీప్ కుమార్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. 1998 వరకు బాలీవుడ్ సినీపరిశ్రమలో ఆయనకు ఎదురే లేదని చెప్పవచ్చు. దిలీప్ కుమార్ సుమార్ 60 ఏళ్ల పాటు సినిమాల్లో నటించారు.
దిలీప్ కుమార్ మొత్తం 65 సినిమాల్లో నటించారు. దేవదాస్, నయా దౌర్, మొగల్ ఇ అజామ్, గంగా జమునా, క్రాంతి, కర్మ చిత్రాలు ఆయనకు బాగా పేరు తీసుకువచ్చాయి. 1998లో వచ్చిన ఖిలా సినిమాలో దిలీప్ కుమార్ చివరిసారిగా నటించారు. దిలీప్ కుమార్ ను కేంద్ర ప్రభుత్వం 1991లో ఆయన్ను పద్మ భూషణ్, 2015లో పద్మ విభూషణ్ అవార్డులతో సత్కరించింది. పాకిస్తాన్ ప్రభుత్వం దిలీప్ కుమార్ ను 1988లో నిషాన్ ఏ ఇంతియాజ్ అవార్డుతో ఘనంగా సత్కరించింది.
దిలీప్ కుమార్ మృతి పట్ల బాలీవుడ్ సినీ పరిశ్రమ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దిలీప్ కుమార్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Veteran actor Dilip Kumar passes away at the age of 98, says Dr Jalil Parkar, the pulmonologist treating the actor at Mumbai’s PD Hinduja Hospital
(File pic) pic.twitter.com/JnmvQk8QIk
— ANI (@ANI) July 7, 2021