హైదరాబాద్- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్లకుంట్ల కవిత బతుకమ్మకు ఎంతటి ప్రాచుర్యం కల్పించారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో మేకమై, మెల్లమెల్లగా అంతరించిపోతున్న బతుకమ్మ పండగకు తెలంగాణ ఉద్యమం సందర్బంగా కల్వకుంట్ల కవిత ఊపిరి పోశారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ బతుకమ్మ పండగను రాష్ట్ర పండుగగా ప్రకటించారు.
ఇదిగో ఇప్పుడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బతుకమ్మ పాట కోసం ఇద్దరు గొప్ప సాంకేతిక నిపుణలను ఒకచోట చేర్చారు. వాళ్లు మరెవరో కాదు ఒకరు ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకులు ఏఆర్ రహమాన్ ఐతే, మరొకరు ప్రముఖ సినీ దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్. వీరిద్దరి కలయికలో బతుకమ్మ ప్రత్యేక సాంగ్‌ను రూపొందించారు. ఈ బతుకమ్మ పాటకు గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్ట్ చేయగా, ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చారు.
బతుకమ్మ పండగ సందర్బంగా కల్వకుంట్ల కవిత ఈ పాటను గౌతమ్ మీనన్ తో కలిసి విడుదల చేశారు. ఎఆర్ రెహమాన్ తన ట్విట్టర్లో ఈ పాటను షేర్ చేశారు. బతుకమ్మ పండుగకి తన కుటుంబంతో కలిసి సొంత ఊరుకి వచ్చిన ఓ మహిళ దారిలో తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది. తాము తమ చిన్నతనంలో బతుకమ్మ పండగను ఎలా జరుపుకునేవారో తన కూతురికి చెబుతూవస్తుంది. అలా తన కూతురికి చెబుతుండగానే వాళ్ల ఊరు వచ్చేస్తుంది.
ఆమె తన ఇంటకి వెళ్లడం అక్కడ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడటం.. అలా అలా పాట సాగిపోతుంది. అల్లిపూల వెన్నెల చెరువులోన కురవగా.. పూల ఇంధ్ర ధనస్సులే నేల మీద నిలవగా.. అంటూ సాగే ఈ పాటలో తంగేడి పూలు, పుట్టమన్ను.. ఇలా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబిస్తాయి. పాటను చాలా రిచ్ గా చిత్రీకరించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం, గౌతమ్ మీనన్ చిత్రీకరణ ఆకట్టుకుంటుంది.