కొన్ని ప్రేమ కథలు మధ్యలోనే ఆగిపోతాయి. మరికొన్ని లవ్ స్టోరీలు చివరి వరకు వెళ్తాయి. ప్రేమించిన వ్యక్తులతోనే కలిసి బతకాలని చాలా మంది అనుకుంటుంటారు. కానీ పిల్లల ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఎదురించి మరీ ప్రియుడినే పెళ్లి చేసుకుంటున్నారు. ఇలాంటి లవ్ మ్యారేజ్ లు రోజుకో చోట జరుగుతున్నాయి. తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లి ఇష్టం లేని ఓ యువతి ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని అతనితో పాటు వెళ్లిపోయింది. కానీ.. విధి వెక్కిరించడంతో ఊహించని ప్రమాదంలో ప్రియుడు మరణించడగా, ప్రియురాలి పరిస్థితి విషమంగా మారింది. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
అసలేం జరిగిందంటే? జిల్లాలోని రంపచోడవరం మండలం చెరువూరుకు చెందిన పోతురాజు అనే యువకుడికి తెనాలికి చెందిన మెర్సీ అనే యువతితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ ఒకే చోట పనిచేస్తుండడంతో వీరి పరిచయం రాను రాను ప్రేమగా మారింది. దీంతో ఒకరిపై ఒకరికి ఇష్టం కలగడంతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. కొన్నాళ్లకి వీరి ప్రేమ విషయం ఇరువురి తల్లిదండ్రులకు చెప్పి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ వీరి ప్రేమకు యువతి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో పాటు మరో యువకుడితో పెళ్లి చేయాలని చూశారు. యువతికి మాత్రం తల్లిదండ్రులు కుదుర్చిన పెళ్లి అస్సలు ఇష్టం లేదు. ఇక తెల్లారితే పెళ్లి, ఏం చేయాలో అర్థం కాక మెర్సీ అదే రోజు రాత్రి ప్రియుడితో పాటు వెళ్లిపోయింది.
ఇంట్లో కూతురు కనిపించకపోవడంతో ఖంగారుపడ్డ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రేమ జంటను కనిపెట్టి విచారణ కోసం స్టేషన్ కు రావాలంటూ ఫోన్ చేసి చెప్పారు. పోలీసులకు భయపడ్డ ఆ ప్రేమ జంట స్టేషన్ కు వెళ్లేందుకు బైక్ పై బయలుదేరారు. బైక్ పై ఇద్దరు వెళ్తుండగా వీరవల్లి సమీపంలోకి రాగానే పోతురాజుకు ఫోన్ వచ్చింది. బైక్ నడుపుతూనే ఫోన్ మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే బైక్ అదుపుతప్పి బ్రిడ్జ్ గోడను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రియుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.., ప్రియురాలికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు మెర్సిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. తల్లిదండ్రులను ఎదురించి మరీ పెళ్లి చేసుకోవాలనుకున్న ఈ ప్రేమ జంటను విధి వెక్కిరించింది. ఈ ఊహించని ప్రమాదంలో ప్రియుడు మరణించడంతో ప్రియురాలి కంట కన్నీరు ఆగడం లేదు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.