రామాయణంలో సీతకు రాముడు అగ్ని పరీక్ష పెడతాడు. ఆ అగ్ని పరీక్షలో సీత విజయం సాధిస్తుంది. ఇది ఎప్పుడో వేల ఏళ్ల క్రితం జరిగిన సంఘటన. కానీ, ఇప్పుడు కూడా కొంతమంది తమ స్వార్థం కోసం ఇలాంటి అగ్ని పరీక్షలు పెడుతున్నారు.
భారతదేశం వింత, విచిత్రమైన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు పుట్టినిల్లు. ఇక్కడ మూడ నమ్మకాలు కూడా ఎక్కువే. ఒకప్పుడు పోలీసు వ్యవస్థ బలంగా లేని సమయంలో గ్రామ పెద్దలు సమస్యలపై పంచాయతీలు నిర్వహించేవారు. తప్పొప్పులు తేల్చేవారు. కొన్ని సార్లు తప్పు చేసిన వారిని గుర్తించటానికి విచిత్రమైన పద్దతుల్ని అవలంభించేవారు. దేవుడి గుడిలో ప్రమాణం చేయించటం.. నిప్పుల్లో నడవటం వంటివి ఈ కోవకు చెందుతాయి. తాజాగా, వివాహేతర సంబంధం కనిపెట్టడానికి ఓ వ్యక్తికి అగ్ని పరీక్ష పెట్టారు పెద్దలు. అతడి చేత బాగా ఎర్రగా కాలుతున్న గడ్డపారను తీయించారు.
ఈ సంఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ములుగు జిల్లా జంగాల పల్లికి చెందిన జగన్నాథ గంగాధర్ తన భార్యతో సంబంధం పెట్టుకున్నాడని అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అనుమానిస్తూ వస్తున్నాడు. ఈ వ్యవహారంపై కుల పెద్దలను ఆశ్రయించాడు. పెద్ద మనుషులు పంచాయితీ నిర్వహించారు. తనకు అతడి భార్యతో సంబంధం లేదని జగన్నాథం స్పష్టం చేశాడు. అయినా వాళ్లు పట్టించుకోలేదు. మూడు నెలలుగా పంచాయితీ జరుగుతున్నా సమస్య పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలోనే పెద్ద మనుషులు క్రూరంగా ఆలోచించారు.
ఎర్రగా కాలుతున్న గడ్డపారను చేతులతో పట్టుకోవాలని, అప్పుడు చేతులు కాలకపోతే ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. జగన్నాథం వారు చెప్పినట్లుగానే లక్నవరం సరస్సు దగ్గర తడి బట్టలతో ఎర్రగా కాలుతున్నగడ్డపారను చేతులతో పట్టుకున్నాడు. అతడికి ఏమీ కాలేదు. తాను తప్పు చేయలేదని అతడు పెద్దలకు స్పష్టం చేశాడు. కానీ, పెద్దలు మాత్రం అతడిని పట్టించుకోలేదు. చేతులకు గాయాలు ఉన్నాయంటూ వేధించటం మొదలుపెట్టారు. దీంతో జగన్నాథం పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.