కష్టానికి రూపం ఉండదు. అది ఎటు నుండైనా వచ్చి మనలని కబళించాలని చూస్తుంది. కానీ.., సాయానికి ఓ రూపం ఉంటుంది. ఎందుకంటే మనిషికి సహాయం చేసేది సాటి మనిషే కాబట్టి. దీన్ని మానవత్వం అంటారు. కరోనా కష్టకాలంలో ఈ మానవతావాదాన్ని గొప్పగా చాటిన వ్యక్తి ఎవరంటే సోనూసూద్ పేరే వినిపిస్తుంది. కరోనా మొదటి వేవ్ నుండి దేశంలో సోనూ సహాయ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. దానం చేసే సమయంలో ఈయన కర్ణుడిని మించిపోతున్నాడు. ఆక్సిజన్ అందక పోయే ప్రాణాలను కాపాడుతూ.., సంజీవనిమీ మోసిన హనుమంతుడు అవుతున్నాడు. పేదవారిని ఆదుకుంటూ.., వారి అవసరాలను తీరుస్తూ సూపర్ హీరో అనిపించుకుంటున్నాడు. ఇంత చేసినా.., ఇంత చేస్తున్నా సోనూసూద్ ఎప్పుడు తన గురించి తాను గొప్పగా చెప్పుకుంది లేదు. చేసే పనిలో మంచి కనిపించాలి గాని.., అందులో మనం కనిపించాల్సిన అవసరం లేదన్నది సోనూసూద్ స్టయిల్. తాజాగా.. ఇప్పుడు ఇలా మౌనంగానే మరో మంచి పని చేసి శభాష్ అనిపించుకున్నారు సూనుసూద్. పుట్టుకతోనే గుండె జబ్బుతో బాధపడుతున్న ఏడాది వయసు చిన్నారి ప్రాణాలను సోనూసూద్ మంచి మనసుతో కాపాడాడు. పేదరికంతో అల్లాడిపోతున్న ఆ కుటుంబానికి అండగా నిలిచాడు.
ఆ వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్దిపల్లి మండలం రాజాపురం గ్రామానికి చెందిన గౌరవరపు భాస్కరరావు, సత్య దంపతులకు తేజాకృష్ణ ఒక్కడే సంతానం. భాస్కరరావు ఆటో నడుపుతుంటారు. అదే ఆ కుటుంబానికి జీవనాధారం. తమ ఏడాది వయసున్న బాబుకి గుండె జబ్బని.. ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పడంతో ఆ దంపతులు తల్లిడిల్లిపోయారు. తమకు ఉన్నదంతా ఊడ్చినా కొడుక్కి ఆపరేషన్ చేపించలేమని కృంగిపోయారు. కళ్ళ ముందే కరిగిపోతున్న బిడ్డ ఆయుష్ చూసి ఆ తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకొని రోజు లేదు. కానీ.., వీరి కష్టాన్ని పైనున్న దేవుడు విన్నాడు. సూనుసూద్ అనే దేవుడికి వీరి కష్టం తెలిసేలా చేశాడు. ఆ గ్రామంలో ఉంటున్న జన విజ్ఞాన వేదిక సభ్యులు ఈ విషయాన్ని, ఆ కుటుంబం అవసరాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగులోకి తెచ్చారు. ఈ విషయం ట్విట్టర్ ద్వారా తెలిసిన వెంటనే సోనూసూద్ స్పందించారు. బాబుకు వైద్యం చేయించే బాధ్యత తాను తీసుకుంటున్నట్టు హామీ ఇచ్చారు. దీనికోసం చిన్నారితో పాటు తల్లిదండ్రులను ముంబయి రప్పించి.. అక్కడి ఎస్ఆర్సీసీ పిల్లల ఆసుపత్రిలో గురువారం రోజు శస్త్రచికిత్స చేయించారు. ప్రస్తుతం చిన్నారి తేజాకృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉంది. చిన్నారి వైద్యానికి సహకరించి.. పేద దంపతుల కంటి వెలుగు ప్రాణాలు కాపాడిన రియల్హీరో సోనూసూద్ను దేశమంతా ప్రసంశల్లో ముంచెత్తుతున్నారు. చావు తప్ప మరో మార్గం లేదనుకున్న తమ బిడ్డని బతికించినందుకు ఆ తల్లిదండ్రి సోనూ సర్ దేవుడు అంటూ కీర్తిస్తున్నారు. మరి.. సోనూసూద్ చేసిన ఈ మంచి పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.