కరీంనగర్- ఈ ఉరుకులు పరుగుల జీవితంలో అందరు బిజీ అయిపోయారు. భార్యా భర్తలు ఇద్దరూ సంపాదిస్తే గాని ఇళ్లు గడవడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో చాలా మంది పిల్లలు కలగక చాలా ఆందోళన చెందుతున్నారు. పిల్లల కోసం చాలా జంటలు డాక్టర్ల చుట్టూ ఆస్పత్రులకు తిరుగుతున్నారు. గుళ్లూ, గోపురాలు తిరిగి పిల్లలకోసం ఎన్నో పూజలు చేస్తున్నారు. ఒక్క బిడ్డ పుడితే చాలు తమ జీవితానికి అని చాలా మంది అనుకుంటున్నారు.
కానీ కొందరికి మాత్రం దేవుడు అడగకుండానే వరం ఇస్తాడు. చాలా మంది ఒక బిడ్డ కోసమే పరితపిస్తుంటే.. ఒకరు కాదు, ఇద్దరు కాదూ.. ముగ్గురు కాదు.. ఏకంగా నలుగురి పిల్లలు పుడితే.. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా. అవును మరి తెలంగాణలో ఓ మహిళ ఒకే కాన్పులో ఏకంగా నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో వారి ఆనందానికి అవధుల్లేవు.
కరీంనగర్‌లోని యశోద కృష్ణ ఆస్పత్రిలో నికిత అనే మహిళ ఓకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. నలుగురిలో ఇద్దరు పాపలు, ఇద్దరు బాబులు ఉన్నారు. ఒకేసారి నలుగురు పిల్లల్ని చూసి పేరెంట్స్ నికిత, సాయి కిరణ్ ఆనందంలో మునిగిపోయారు. ఒకే కాన్పులో పుట్టిన నలుగురు పిల్లలు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు చెప్పారు.
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే సరిగ్గా నాలుగు నెలల క్రితం నికిత అక్క లిఖితకు కూడా ఓకే కాన్పులో ముగ్గురు కవల పిల్లలు జన్మినిచ్చింది. ఇలా ఇద్దరు అక్కా చెల్లెళ్ళకు ఏడుగురు పిల్లలు జన్మించడంతో వారి ఫ్యామిలీ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమకు దేవుడిచ్చిన వరం అని మురిసిపోతున్నారు.