ఈ మద్య సినిమాల ప్రభావం జనాలపై బాగానే చూపిస్తుందని పలు సంఘటనలు రుజువు చేశాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల కిడ్నాపింగ్ వ్యవహారాలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.
నేటి సమాజంలో యువత పై సినిమాల ప్రభావం ఎక్కువగా పడుతుందని పలు సంఘటనలు నిరూపించాయి. సినిమాలో విలన్లు కిడ్నాప్ ప్లాన్ లు, మర్డర్ స్కెచ్ లు చేయడం చూసి రియల్ లైఫ్ లో కూడా కొంత అలాంటి ప్లాన్లు చేస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలు ఎక్కువగా ప్రేమ విషయంలో జరుగుతున్నాయి. ప్రేమికుల వ్యవహారాల్లో ఎన్నో ట్విస్టులు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ కోవకు చెందిన ఘటనే కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
కరీంనగర్ జిల్లాలో బుధవారం రాత్రి ఓ జంట పెళ్లి చేసుకున్న కొద్ది సేపటికే పెళ్లి కూతురు ని సినీ ఫక్కీలో కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. హనుమకొండ జిల్లా మణికొండ గ్రామానికి చెందిన వధువు.. వరంగల్ జిల్లాకు చెందిన వరుడు కూలీ పనులు చేసుకుంటున్నారు.. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకోవాలని భావించారు ఈ జంట. ఈక్రమంలోనే ప్రేమ గురించి వధువు ఇంట్లో తెలియడంతో పెళ్లికి నిరాకరించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రేమికులు పెద్దలను ఎదిరించి కొండగట్టు గుడిలో బుధవారం రాత్రి ప్రేమ పెళ్లి చేసుకున్నారు.
పెళ్లి చేసుకొని తిరిగి వస్తున్న సమయంలో హుజూరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ కి కూత వేటు దూరంలో దాదాపు 20 మంది దుండగులు కారుని ఆపి పెళ్లి కొడుకును చితకబాది కారులో ఉన్న నవ వధువును సినిమా స్టైల్లో కిడ్నాప్ చేశారు. ఈ కిడ్నాప్ తీరు చూస్తుంటే.. సీసీ ఫుటేజ్ ని పరిశీలిస్తే యువతి బంధువులే పక్కా ప్లాన్ ప్రకారం చేసి ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉంటే..కిడ్నాప్ అయిన యువతి వివరాలు.. కిడ్నాపర్ల చేతిలో దెబ్బలు తిన్న యువకుడి వివరాలు తమకు తెలియరాలేదని.. తమకు ఎలాంటి ఫిర్యాదు కూడా అందలేదని చెప్పారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.