అందరూ ట్రెండ్ ని ఫాలో అవుతుంటే అతను మాత్రం ట్రెండ్ సెట్ చేశాడు. లక్షల్లో వచ్చే సాఫ్ట్ వేర్ ఉద్యోగం కాదని.. అంతరించిపోయిన గోలి సోడా వ్యాపారాన్ని మొదలుపెట్టి పూర్వ వైభవం తీసుకొచ్చాడు. ఏటా 4 కోట్ల టర్నోవర్ చేస్తున్నాడు. ఆ యువకుడి సక్సెస్ స్టోరీ మీ కోసం.
గోలి సోడాలు 90ల కాలంలో బాగా ప్రాచుర్యం పొందాయి. గోలి సోడాతో 90ల నుంచి వెనక్కి వెళ్తే వచ్చే తరాలకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఇంటికొచ్చిన అతిథుల దాహం తీర్చేది, సామాన్యుడి భరించగలిగే ధరలో ఉండేది ఈ గోలి సోడా. వేసవిలో దీనికున్న డిమాండ్ వేరే. ఎంతటి దాహాన్ని అయినా వెంటనే తీర్చేస్తుంది ఈ గోలి సోడా. బస్టాండుల్లో, రోడ్డు పక్కన, థియేటర్స్ లో ఇలా అనేక చోట్ల ఈ గోలి సోడాలు దర్శనమిచ్చేవి. ఎక్కడో మారుమూల పల్లెటూర్లలో తప్పితే సిటీల్లో ఈ గోలి సోడాలు కనిపించడం లేదు. పల్లెటూర్లలో కూడా దాదాపు కనుమరుగైపోయాయి. అయితే అంతరించిపోయిన గోలి సోడాకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చాడో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలేసి మరీ ఈ అంతరించిపోయిన గోలి సోడా కాన్సెప్ట్ ని పట్టుకున్నాడు. అందరూ కంప్యూటర్ మీద కోడింగ్ లు, ప్రాజెక్టులతో బిజీగా ఉంటే ఈ యువ ఇంజనీర్ మాత్రం గోలి సోడా వ్యాపారం చేస్తున్నాడు.
కరీంనగర్ జిల్లాకు చెందిన తుల రంగనాథ్ ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. జీతం కూడా బాగుంది. అయినా కూడా ఇవేమీ సంతృప్తినివ్వలేదు. దీంతో ఉద్యోగం వదిలేసి తాను పుట్టి పెరిగిన ఊర్లోనే ఏదైనా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు. బాగా ఆలోచించి గోలి సోడా కంపెనీ పెట్టాలని అనుకున్నాడు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం గోలి సోడాలు తయారు చేసేవాళ్ళని చూశాడు. ఇప్పుడు ఎవరూ చేయడం లేదని తెలిసి ఆ బాధ్యతను తన మీద వేసుకున్నాడు. గోలి సోడా తయారు చేసి అమ్మాలని ఫిక్స్ అయ్యాడు. ఈ విషయం ఇంట్లో చెప్తే ఒప్పుకోలేదు. అయినా పట్టు విడవకుండా ప్రయత్నించి తల్లిదండ్రులను ఒప్పించాడు.
అప్పటికి ఇంకా రంగనాథ్ కి పెళ్లి కాలేదు. బిజినెస్ లాస్ అయితే పెళ్లి సంబంధాలు రావని కూడా తెలుసు. అయినా సరే తన మీద తనకున్న నమ్మకంతో 2020లో జాబ్ మానేసి రూ. 30 లక్షలు అప్పు చేసి మరీ గోలి సోడా కంపెనీ ప్రారంభించాడు. ఐతే గోలి సోడా వ్యాపారం అంత సులువు కాదు. దాని గురించి పలువురు వ్యక్తులను అడిగి తెలుసుకున్నాడు. ఊళ్ళో కొంత భూమిని లీజుకు తీసుకుని గోలి సోడా ప్లాంట్ ను స్థాపించాడు. మొత్తానికి కష్టపడి, ఇష్టంతో అనుకున్నది సాధించాడు. రూ. 30 లక్షలతో ప్రారంభించిన గోలి సోడా వ్యాపారం 4 కోట్ల టర్నోవర్ కి చేరుకుంది. నెలకు రూ. 30 లక్షలకు పైనే సంపాదిస్తున్నాడు. ఇప్పుడు అతని కంపెనీలో 100 మంది పని చేస్తున్నారు.
కరీంనగర్ జిల్లాలోనే కాకుండా పక్క జిల్లాల్లో ఉన్న కిరాణా దుకాణాలకు, బేకరీలకు గోలి సోడాలను ఎగుమతి చేస్తున్నామని రంగనాథ్ అన్నారు. మొదట్లో ప్లాంట్ పెట్టినప్పుడు ఇబ్బంది అయ్యిందని.. ఆ తరువాత మెల్లగా ప్లాంట్ ని విస్తరింపజేశామని అన్నారు. ఖచ్చితంగా సాధిస్తాం అని నమ్మకం ఉన్నప్పుడు లైఫ్ లో రిస్క్ తీసుకోవాల్సిందే అని ఈ యువకుడు నిరూపించాడు. ఉద్యోగి ఉద్యోగం చేస్తే ఒక్కడే తింటాడు, మహా అయితే నలుగురు తింటారు. అదే ఉద్యోగి వ్యాపారం చేస్తే 100 మంది తింటారు. రిస్క్ తీసుకుంటే వచ్చే బెనిఫిట్స్ ఇవే. ఫెయిల్యూర్, సక్సెస్ తో పని లేకుండా అనుకున్నది చేయాలని ప్రయత్నించిన వారు ఎప్పటికీ సక్సెస్ అవుతారు. మరి కనుమరుగైపోయిన గోలి సోడాకి పూర్వ వైభవం తీసుకొచ్చిన ఈ యువకుడిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.