చిన్నారి జీవితాన్ని చిదిమేసిన మానవమృగం శవమైంది. ఈ వార్త ఆ చిన్నారి కుటుంబానికి కొంత ఊరటను మాత్రమే ఇచ్చింది తప్ప గుండె కోతను మాన్పించలేదు. పైగా ఘటన జరిగి ఇన్ని రోజులకు నిందితుడు తప్పించుకుని తిరిగి చివరకు రైల్వే ట్రాక్‌పై శవమై కన్పించడం, అతనిది ఆత్మహత్యనా? ప్రమాదమా? హత్యనా? అనే అనేక అనుమానాలు కలగడం సహజం. అసలు అతను నిందితుడు రాజునేనా అని కూడా చిన్నారి కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారి సందేహాలు నివృత్తి చేసి, రైల్వే ట్రాక్‌పై దొరికిన శవం నిందితుడు రాజుదే అని నిర్ధారించుకునేందుకు పోలీసులు బాలిక కుటుంబసభ్యులను, మరికొంత మంది కాలనీ వాసులను వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. పోలీసు వాహనంలో చినార్ని కుటుంబ సభ్యులను వరంగల్ వెళ్లి ట్రాక్‌పై దొరికిన శవాన్ని చూడనున్నారు.
కాగా అంతకుముందు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు అనే వార్త రాగానే కుటుంబసభ్యులతో మీడియా ప్రతినిధులు మాట్లాడగా.. చనిపోయింది రాజు అని ఎలా నిర్ధారించారు. బాడీని ఇక్కడికి తీసుకొస్తే ముఖం చూసి మేము నిర్ధారిస్తాం అని చిన్నారి తండ్రి తెలిపారు. బతికుంటే కొట్టి చంపేస్తారనే భయం ఉండేది ఇప్పుడు ఎలాగే చనిపోయాడు అంటున్నారుగా ఇక్కడికి శవం తీసుకుని రండి మేము నమ్ముతాం అని అన్నారు.
పోలీసులే చంపారు అంటున్న రాజు కుటుంబం..
తన కొడుకును పోలీసులే చంపి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని రాజు తల్లి ఆరోపిస్తున్నారు. ఎంజీఎంలో రాజు శవానికి పోస్టుమార్టం జరిపిన తర్వాత మృతదేహాన్నికుటుంబసభ్యులకు అందజేయనున్నారు.