ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇంట్లో పెద్దలకు విషయం చెబితే వాళ్లు సరే అన్నారు. ఇంకేముంది అంగరంగవైభవంగా వివాహం జరిగింది. కానీ తీరా పెళ్లి అయిన తర్వాత భర్త వరుసకు తనకు అన్న అవుతాడని తెలిసి పెళ్లి అయిన వారానికి వధువు ఆత్మహత్య చేసుకుంది. అది తెలిసి వరుడు కూడా ఆత్మహత్యకు యత్నించాడు. వివరాలు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని నెహ్రూ నగర్ గ్రామానికి చెందిన డిగ్రీ చదువుతున్న విద్యార్థిని బోడ శ్వేతను అదే మండలంలోని కట్టుగూడెం గ్రామానికి చెందిన గూగులోతు వెంకటేష్ అలియాస్ బంటి ప్రేమించాడు. అతడి ప్రేమకు శ్వేత కూడా ఓకే చెప్పింది. అయితే అతడు వరుసకు ఆమెకు అన్న అవుతాడు. తాను ప్రేమించిన అమ్మాయిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని భావించిన వెంకటేష్ తన ఇంటి పేరును తప్పుగా చెప్పి ఆమెకు వరుసకు బావ అవుతానని చెప్పి నమ్మించాడు. అది నిజమని నమ్మిన శ్వేత తన ఇంట్లో వాళ్లను కూడా ఒప్పించింది. పది రోజుల క్రితం వెంకటేష్-శ్వేత వివాహం చేసుకున్నారు.
అయితే పెళ్లి అయిన వారం తర్వాత శ్వేతకు అసలు నిజం తెలిసింది. వెంకటేష్ తన ఇంటి పేరును తప్పు చెప్పి మోసం చేశాడని భావించింది. అన్న వరుస అయిన వెంకటేష్‌ను వివాహం చేసుకున్నాని మనస్థాపం చెంది మంగళవారం తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. శ్వేత చనిపోయిన విషయం తెలిసిన వెంకటేష్ తన గుట్టు రట్టయిందని తెలిసి, తన స్వగ్రామం అయిన కట్టుగూడెంలో బావిలో దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. గమనించిన తల్లిదండ్రులు వెంకటేష్‌ను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఇంటి పేరు తప్పు చెప్పి మోసం చేసి తమ అమ్మాయి ప్రాణాలు తీసుకున్నాడంటూ శ్వేత బంధువులు వెంకటేష్ ఇంటి ముందు ఆందోళకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చివరికి పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఆందోళన విరమించారు.