సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిస్తుంది. ఇప్పటికే ఆయన ఆస్పత్రి బిల్లును క్లియర్ చేయించిన సీఎం జగన్.. తాజాగా ఆయన కుటుంబానికి ప్రభుత్వ స్థలం కేటాయించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. న్యూమోనియాతో బాధపడుతూ నవంబర్ 24న హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చేరిన సిరివెన్నెల సీతారామశాస్త్రి.. నవంబర్ 30 మంగళవారం మరణించారు.
ఆయన మరణవార్త విని సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కిమ్స్ ఆస్పత్రిలో ఆయన వైద్యానికి అయిన మొత్తం ఖర్చును ఏపీ ప్రభుత్వం భరిస్తుందని ప్రకటించారు. దీనిపై సిరివెన్నెల కుటుంబం సీఎం జగన్‌కు కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వ స్థలం కూడా కేటాయించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు సీఎం జగన్. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎన్నో వేల పాటలకు సాహిత్యం అందించారు. ఆయన సినీ రంగానికి అందించిన సేవలకు గాను 2019 ఏడాదికి ఆయనకు పద్శశ్రీ అవార్డు కూడా లభించింది.