కొన్నేళ్లుగా మలయాళ భాషలో తప్ప.. తెలుగు, తమిళ, హిందీ ఇలా అన్ని భాషలలో సినిమాలు రీమేక్ అవుతుండటం చూస్తున్నాం. గతంలో ఎన్నో సినిమాలు రీమేక్స్ గా ప్రేక్షకులను అలరించాయి. కానీ.. కొంతకాలంగా రీమేక్ సినిమాలు ఒరిజినల్ మూవీస్ కి దగ్గరలోకి కూడా వెళ్లలేకపోతున్నాయి. రీమేక్స్.. ఎందుకని మన దగ్గర క్లిక్ అవ్వట్లేదు..?
రీమేక్స్.. చిత్రపరిశ్రమలో రెగ్యులర్ గా వినిపించే పదం. కొన్నేళ్లుగా మలయాళ భాషలో తప్ప.. తెలుగు, తమిళ, హిందీ ఇలా అన్ని భాషలలో సినిమాలు రీమేక్ అవుతుండటం చూస్తున్నాం. వీటన్నింటికీ సోర్స్ మలయాళం ఇండస్ట్రీ. ముఖ్యంగా మళయాళం రీమేక్స్ తెలుగులో ఎక్కువగా తెరపైకి వస్తున్నాయి. గతంలో ఎన్నో సినిమాలు రీమేక్స్ గా తెలుగు, హిందీ, తమిళ ప్రేక్షకులను అలరించాయి. కానీ.. కొంతకాలంగా ఒరిజినల్ మూవీస్ కి దగ్గరలోకి కూడా వెళ్లలేకపోతున్నాయి రీమేక్స్. మలయాళం సినిమాలు ఎందుకని మన దగ్గర క్లిక్ అవ్వట్లేదు..? ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి? అనే విషయాలు గమనిస్తే.. ప్రధానంగా ఒరిజినల్ సినిమాల కథాకథనాలు డిస్టర్బ్ అవుతున్నాయట.
ప్రతి ఏడాది ఎన్నో ,మలయాళం సినిమాలు తెలుగులో రీమేక్ అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో గమనించినట్లయితే.. అయ్యప్పనుమ్ కోశియుమ్(భీమ్లా నాయక్), లూసిఫర్(గాడ్ ఫాదర్), కప్పేలా(బుట్టబొమ్మ), మహేషింటే ప్రతీకారం(ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య), అంగమలే డైరీస్(ఫలక్ నుమా దాస్), దృశ్యం(దృశ్యం), జోసెఫ్(శేఖర్).. ఇలా మలయాళంలో బిగ్ హిట్స్ అన్నీ తెలుగులో రీమేక్ అయ్యాయి. ఇంకా అవుతూనే ఉన్నాయి. కానీ.. వీటిలో దృశ్యం సిరీస్, ప్రేమమ్ సినిమాలు తప్ప మిగతా సినిమాలేవీ ప్రేక్షకులలో పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. అదీగాక ఒరిజినల్ సినిమాలకు దగ్గరలోకి కూడా వెళ్లలేకపోయాయని అనిపించుకున్నాయి.
గతంలో తెలుగులోకంటే ఎక్కువగా హిందీలో మలయాళం రీమేక్స్ సూపర్ సక్సెస్ అయ్యాయి. హేరాఫెరి, బాడీగార్డ్ ఇలా ఎన్నో సూపర్ హిట్స్.. కానీ, రీసెంట్ గా మలయాళం డ్రైవింగ్ లైసెన్స్ మూవీకి రీమేక్ గా వచ్చిన ‘సెల్ఫీ’ బొక్కబోర్లా పడింది. అయితే.. రీమేక్ సినిమాలు ఒరిజినల్ మూవీ మ్యాజిక్ ని రిపీట్ చేయలేకపోవడానికి ఈ మధ్య ఓటిటి వేదికలు కూడా కారణాలలో ఒకటిగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. ఇదివరకు ఒరిజినల్ సినిమాలు వేరే భాషలో రీమేక్ అయినా.. అది ఏ సినిమా కథ ఎక్కడినుండి తెచ్చారో తెలిసేది కాదు. సినిమా వచ్చాక నచ్చితే చూసేవారు లేకపోతే లేదు అన్నట్లుగా ఉండేది అప్పట్లో వ్యవహారం.
ఇప్పుడలా కాదు. ఓటిటిలు అందుబాటులోకి వచ్చాక అందరూ ఇళ్లలో కూర్చొని అన్ని భాషల సినిమాలు చూస్తున్నారు. దీంతో ఆల్రెడీ చూసేసిన సినిమాలను ఎవరు తీసినా.. చూసేందుకు ప్రేక్షకులు సిద్ధంగా ఉండట్లేదు. పైగా అసలు విషయం ఏంటంటే.. ఆల్రెడీ ఒరిజినల్ లో చూశాం కదా! ఇంకా రీమేక్ లో చూడటానికి ఏముంది? అనే విధంగా మారింది తంతు. కొందరు కథను పక్కన పెట్టి.. హీరోలను ఎలివేట్ చేసేందుకు ట్రై చేస్తూ.. సోల్ ని మిస్ చేస్తున్నారు. ఇంకొందరు రీమేక్ అని చెప్పి.. కథాకథనాలను ఉన్నది ఉన్నట్లుగా కొనసాగిస్తున్నారు. రీమేక్స్ అనేవి కొత్తగా లేకపోతే ఆడియెన్స్ ఎందుకు చూస్తారు?
మలయాళం ఇండస్ట్రీ.. కొన్నేళ్లుగా బెస్ట్ కథలు, బెస్ట్ సినిమాలను అందిస్తోంది. అక్కడినుండి హక్కులను కొనుక్కొని మనవాళ్ళు.. తమిళ, హిందీ వాళ్ళు రీమేక్స్ చేయడానికి తెగ ఆరాటపడిపోతూ పోటీ పడుతున్నారు. కానీ.. ఒరిజినల్ ని తలదన్నే విధంగా.. అంతకంటే బెటర్ గా మాత్రం ప్రెజెంట్ చేయలేకపోతున్నారు. అంటే.. రానురానూ రీమేక్ సినిమాలనేవి తెలుగు వాళ్లకు కత్తిమీద సాములా తయారయ్యిందా? అంటే అవుననే చెప్పుకోవాలని సినీవర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. సినిమాలు రీమేక్ అయితే ఆల్రెడీ ఓటిటిలో చూశాం.. ఇందులో ఏముంది? అంటున్నారు. అదే రీమేక్ అని చెప్పకుండా తీస్తే.. ఇందులో ఏముంటుందిలే! అని ఈజీగా లైట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే.. సినిమా రీమేక్, ఒరిజినల్ ఏదైనా సూపర్ హిట్ అనే టాక్ వినిపిస్తేనే జనాలు చూసేందుకు సిద్ధం అవ్వట్లేదు. సో.. ఇకపై అయినా రీమేక్స్ తో కొత్త మ్యాజిక్ క్రియేట్ చేస్తారేమో చూడాలి!