రీమేక్ అన్న పదానికి మహేష్ బాబు డిక్షనరీలో చోటు లేదు. సూపర్ హిట్ మూవీ రీమేక్ అంటే ఏ హీరో అయినా ఎగిరి గంతులేస్తారు. కానీ మహేష్ మాత్రం నో రీమేక్ అని చెప్పేస్తారు. ఎందుకంటే?
ఒక సినిమా కథని ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లోనూ చెప్పవచ్చు. పలానా భాషలో మాత్రమే కథ సెట్ అవుతుంది, ఇంక ఏ భాషలోనూ సెట్ అవ్వదు అనే రూల్ కూడా లేదు. సినిమా పుట్టిన దగ్గర నుంచే ఒక భాషలో రిలిజ్ అయిన సినిమా ఇంకో భాషలో పుననిర్మాణం అవుతూనే ఉంది. దీన్నే ఫక్తు సినీ భాషలో చెప్పాలంటే రీమేక్. దాదాపుగా భారతీయ చిత్ర పరిశ్రమలో ఉన్న హీరోలందరి దగ్గర నుంచి హీరోయిన్ లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు దాకా రీమేక్ చిత్రాల్లో నటించిన వాళ్ళే. ముఖ్యంగా మన తెలుగు పరిశ్రమనే తీసుకుంటే తెలుగులో వున్న హీరోలందరూ కూడా రీమేక్ సినిమాల్లో నటించిన వాళ్ళే. నటిస్తూ వున్నారు కూడా.
ఆ మాట కొస్తే పాత తరంలోని ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో సహా కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజులు కూడా రీమేక్ చిత్రాల్లో నటించిన వాళ్ళే. కానీ ఇంతవరకు ఎలాంటి రీమేక్ చిత్రంలో నటించని హీరో ఒకరు వున్నారు. అతనే మహేష్ బాబు. మహేష్ బాబు.. అభిమానులందరి చేత సూపర్ స్టార్ గా కొనియాడబడుతున్న అచ్చ తెలుగు సినిమా హీరో. 1999వ సంవత్సరంలో వచ్చిన రాజకుమారుడు సినిమాతో హీరోగా అరంగ్రేటం చేసారు మహేష్ బాబు. అంటే దాదాపుగా 24 సంవత్సరాలు అవుతుంది. ఈ 24 సంవత్సరాల్లో మహేష్ బాబు ఒక్కటంటే ఒక్క రీమేక్ సినిమాలో కూడా నటించలేదు. వినటానికి కొంచెం వింతగానే ఉన్న వాస్తవం. తన సహ నటులు చాలా మంది రీమేక్ సినిమాలు చేసారు. కానీ మహేష్ మాత్రం రీమేక్ సినిమాలు చేయలేదు. ఒక ఇంటర్వ్యూలో మహేష్ తాను ఎందుకు రీమేక్ లు చేయరో చెప్పుకొచ్చాడు.
ఒక రీమేక్ సినిమా ఒప్పుకుని.. ఆ సినిమాలో నటించాలంటే తనకి ఒరిజినల్ మూవీలో చేసిన నటుడే గుర్తుకొస్తాడని.. దాంతో పోషించే క్యారెక్టర్ మీద కంప్లీట్ కన్ఫ్యూజ్ ఉంటానని అందుకే రీమేక్ లు చెయ్యనని చెప్పుకొచ్చాడు. అలాగే గతంలో ఒకసారి బాలీవుడ్ నుంచి వచ్చిన సినిమా ఆఫర్స్ ని తిరస్కరించడమే కాకుండా తెలుగులో మాత్రమే నటిస్తానని తెగేసి చెప్పాడు .తన సినిమా కెరీర్ లో ఇప్పటివరకు 27 సినిమాల్లో నటించిన మహేష్ బాబు తన తదుపరి సినిమాగా గుంటూరు కారం అనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటి వరకు చేసిన 27 సినిమాలు కూడా డైరెక్ట్ తెలుగు కథల్నే చేసిన మహేష్ బాబుకి తెలుగు వాళ్ళైన మనం ఎంతైనా హాట్సాఫ్ చెప్పాల్సిందే.