యంగ్ హీరోపై సీనియర్ స్టార్ హీరో అర్జున్ సర్జా తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తన కుమార్తెను టాలీవుడ్‌కు పరిచయం చేసేందుకు తానే స్వయంగా సినిమా తీసేందుకు డిసైడ్ అయ్యారు. కథ రాసుకుని డైరెక్షన్ కూడా తానే చేసేందుకు నిర్ణయించుకున్నారు. అయితే ఎవరిని హీరోగా పెట్టాలని అనుకుంటున్న తరుణంలో హీరోగా విశ్వక్ అయితే బాగుంటాడని అర్జున్ భావించారంట. అప్పుడు విశ్వక్‌ని కలిసి కథ చెప్పగా అతనికి పిచ్చిపిచ్చిగా నచ్చిందని చెప్పినట్లు అర్జున్ ప్రెస్‌మీట్‌లో వివరించారు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ, రెమ్యూనరేషన్ విషయంలో విశ్వక్ మేనేజర్ చెప్పిన అమౌంట్ కాస్త ఎక్కువ అనిపించిందని చెప్పారంట. తర్వాత మళ్లీ మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వచ్చారు. సినిమా చేసేందుకు విశ్వక్ కూడా అంగీకరించాడు.
రెమ్యూనరేషన్‌లో కూడా తనకు ఒక ఏరియా రైట్స్ కావాలంటే ఇచ్చేందుకు మేం అంగీకరించాం. అయినా మొదటి నుంచి విశ్వక్ తమను, చిత్రబృందాన్ని బాగా ఇబ్బంది పెట్టారని అర్జున్ ఆరోపించారు. సినిమా కోసం కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు తెలిపారు. ఆ తర్వాత విశ్వక్ సేన్‌కి చేసినన్ని ఫోన్లు తాను ఎవరికీ చేయలేదన్నారు. స్టోరీ సిట్టింగ్స్ కోసం ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతను స్పందించలేదని ఆరోపించారు. కాస్టూమ్ డిజైనర్ ని అయితే ఎన్నిసార్లు పంపానో తనకే తెలియదన్నారు. విశ్వక్ సేన్ కి ప్రొఫెషనలిజం లేదంటూ అర్జున్ అసహనం వ్యక్తం చేశారు. తాను గానీ, తన టీమ్ గానీ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పుకొచ్చారు.
ఒక దర్శకుడిగానే కాకుండా నిర్మాతగాను తాను ఎంతగానో హర్ట్ అయ్యానన్నారు. అతని కోసం రెండుసార్లు షెడ్యూల్స్ క్యాన్సిల్ చేసుకున్నామన్నారు. ఇంకా ఎంతో మంది యాక్టర్స్ కాల్స్ షీట్స్ తీసుకుని షెడ్యూల్ ప్లాన్ చేస్తే తెల్లవారితే షూటింగ్ అనగా.. ఉదయం 4 గంటలకు షూటింగ్ క్యాన్సిల్ చేయాలని అతని నుంచి మెసేజ్ వచ్చిందన్నారు. విశ్వక్ సేన్ ఒక కమిట్మెంట్ లేని నటుడు అంటూ విమర్శించారు. తనకు వంద కోట్లు వస్తాయని చెప్పినా కూడా అతనితో మాత్రం సినిమా చేయనని తేల్చి చెప్పారు. సాయి మాధవ్ బుర్రా, చంద్రబోస్ వంటి వారితో మాటలు, పాటలు రాయిస్తే అవి నచ్చలేదంటూ మధ్యలో విశ్వక్ ఇబ్బంది పెట్టాడంటూ తెలిపారు. తమకు జరిగినట్లు మరెవరికీ జరగకూడదంటూ చెప్పుకొచ్చాడు.
ఈ వివాదంపై హీరో విశ్వక్ సేన్ స్పందించాడు. తన మాటకు సెట్ లో అసలు గౌరవం లేదంటూ చెప్పుకొచ్చాడు. ‘మాటలు, పాటలు, సంగీతం విషయంలో నేను కొన్ని సజీషన్స్ చేసిన మాట వాస్తవమే. కానీ, అందుకు అర్జున్ అస్సలు అంగీకరించలేదు. ఆయన చెప్పిన విధంగానే నడుచుకోవాలంటూ చెబుతున్నారు. అంతేకాకుండా నా మాటకు సెట్ లో గౌరవం లేదు. నా మనసుకు నచ్చని పనిని చేయలేక సినిమా నుంచే తప్పుకున్నాను. సినిమా రెమ్యూనరేషన్, చెక్కులు, అన్ని డాక్యుమెంట్లు నిర్మాతల మండలికి పంపాను..” అంటూ విశ్వక్ సేన్ వ్యాఖ్యానించాడు. మరి.. నిర్మాతల మండలి వీరి సినిమా వివాదంపై ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.