చిత్రపరిశ్రమను వరుస విషాదాలు కుదిపేస్తున్నాయి. ఇప్పటికే రెబల్ స్టార్ కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ మరణవార్తలను జీర్ణించుకోలేకపోతున్న సినీ అభిమానులను మరో ప్రముఖ నటుడి మరణవార్త విషాదంలో ముంచెత్తింది. 70, 80ల దశకాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరుగాంచిన నటుడు సునీల్ షిండే సోమవారం కన్నుమూశారు. ముంబైలోని తన నివాసంలోనే సునీల్ షిండే మరణించినట్లు ఆయన సన్నిహితుడు, సినీ విమర్శకుడు పవన్ ఝా మీడియాకు తెలిపారు. సునీల్ షిండే సోమవారం రాత్రి 1 గంట ప్రాంతంలో కన్నుమూశారని.. అదేరోజు మధ్యాహ్నం పార్శీవాడలోని హిందూ శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరిగినట్లు పవన్ ఝా సమాచారం అందించారు.
ప్రస్తుతం సునీల్ షిండే వయసు 75 ఏళ్ళు. కాగా, ఆయన మృతికి గల కారణాలు ఏంటి అనేది మాత్రం ఇంకా బయటికి రాలేదని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. దాదాపు 30 ఏళ్లపాటు నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగిన సునీల్ షిండే.. కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. సర్కస్, సర్ఫరోష్, శాంతి లాంటి సినిమాలతో ఎనలేని గుర్తింపు సంపాదించుకున్న సునీల్ షిండే.. కెరీర్ లో గాంధీ, ఖల్ నాయక్, ఘయాల్, జిద్ది, దౌడ్, మగన్ మరియు విరుద్ధ్ లాంటి మరెన్నో సినిమాలలో సహాయక పాత్రలు పోషించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. సర్ఫరోష్ లో డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్‌గా, జమీన్ లో రాజకీయ నాయకుడిగా ఇలా వినూత్నమైన పాత్రలు పోషించారు.
ఇక సునీల్ షిండే మరణవార్తతో బాలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. సునీల్ షిండేకి నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో నటుడు రాజేష్ తైలాంగ్ సునీల్ షిండేకి సంతాపం తెలుపుతూ.. “గొప్ప నటుడు, గొప్ప మనిషి.. శ్రీ సునీల్ షెండే ఇక లేరు. శాంతి సీరియల్ లో ఆయనతో కలిసి పనిచేసే అవకాశం లభించడం నా అదృష్టం. ఆ సీరియల్ లో నేను ఆయనకి కొడుకుగా నటించాను. బాబూజీ సాదర్ శ్రద్ధాంజలి” అని ట్వీట్ లో పేర్కొన్నాడు. నటుడిగా సునీల్ షిండే ఎక్కువగా హిందీ, మరాఠీ సినిమాలలో నటించారు.
Great actor and and a great human being …Shri Sunil Shende is no more.I was fortunate enough to get a chance to work with him in the serial Shanti, I played his son. Babuji saadar shraddhanjali 💐🙏 pic.twitter.com/Blt1bDOtB0
— Rajesh Tailang (@rajeshtailang) November 14, 2022