పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. కోట్లాదిమందికి అభిమాన హీరో. అలాంటి పవన్.. లైఫ్ లో ఓ కారణం వల్ల ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నారు. ఆ రోజు అసలేం జరిగింది అనేది 'అన్ స్టాపబుల్' తాజా ఎపిసోడ్ లో బయటపెట్టారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. తెలుగు రాష్ట్రాల్లో ఇది పేరు కాదు ఎప్పటికీ చెరిగిపోని బ్రాండ్. పదేళ్ల ముందు వరకు ఆయనకు సినిమాలు తప్ప మరో ప్రపంచం ఉండేది కాదు. ఎప్పుడైతే ‘జనసేన’ పార్టీ పెట్టి, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారో అప్పటినుంచి తనలోని ఇంట్రావర్ట్ ని పక్కనబెట్టి మాట్లాడుతూ వస్తున్నారు. ఎంత బయటకు పవన్ కనిపిస్తున్నా సరే, సినిమాలు చూస్తున్నా సరే ఆయన చిన్ననాటి విషయాల గురించి అభిమానులు తెలిసింది చాలా తక్కువ. ఎందుకంటే పవన్ పెద్దగా మాట్లాడడు. మరీ ముఖ్యంగా ఇలాంటి విషయాలను అసలే పంచుకోరు. తాజాగా ‘అన్ స్టాపబుల్ 2’ ఫైనల్ ఎపిసోడ్ లో పాల్గొన్న పవన్.. తన టీనేజ్ లో ఏం జరిగిందో చెప్పుకొచ్చారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్’ టాక్ షో ఎంతలా సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2021-22లో తొలి సీజన్ టెలికాస్ట్ చేయగా సూపర్ సక్సెస్ అయింది. తాజాగా పవన్ కల్యాణ్ రెండు ఎపిసోడ్స్ తో రెండో సీజన్ ను గ్రాండ్ గా ఎండ్ చేశారు. అయితే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లాంటి అగ్రహీరో.. ఈ సీజన్ చివరి ఎపిసోడ్స్ కు గెస్టుగా రావడంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అందుకు తగ్గట్లే తొలి ఎపిసోడ్ లో సినిమా ముచ్చట్లు మాట్లాడిన పవన్.. రెండో ఎపిసోడ్ లో మాత్రం చాలా సీరియస్ విషయాల్ని డిస్కస్ చేశారు. పొలిటికల్ గా విషయాలు, ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మాట్లాడుకున్నారు. ఓ సందర్భంలో పవన్.. తన 17 ఏళ్ల వయసులో ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నానో రివీల్ చేశారు.
‘చిన్నప్పుడు నాకు బ్రాంకటైస్(ఆస్తమా) ఉండేది. దీనివల్ల రెగ్యూలర్ గా స్కూల్ కి వెళ్లలేకపోయేవాడిని. రాత్రుళ్లు ఆస్తమా ఎటాక్స్ వచ్చేవి. దీనివల్ల నాకు ఆరోగ్యం అంతా సరిగా ఉండేది కాదు. 6-7 చదివే టైంలో సరిగా స్కూల్ కి వెళ్లలేక ఎక్కువగా ఇంటిపట్టున ఉండేవాడిని. ఎక్కువగా ఫ్రెండ్స్ ఉండేవారు. ఆ టైంలో డిప్రెషన్ కు లోనయ్యేవాడిని. అప్పుడు పుస్తకాలే నాకు స్నేహితులు. స్కూల్స్, కాలేజీలు ఎందుకో నాకు సెట్ కాలేదు. నాలెడ్జ్ చూపించడానికి అవి సరైన వేదికల్లా అనిపించలేదు. ఎగ్జామ్స్ విధానం, టీచర్స్ నాకు నచ్చేవారు కాదు. దీంతో సెల్ఫ్ లెర్నింగ్ అలవాటైపోయింది. ఆ టైంలో నా తోటి వాళ్లందరూ కూడా తర్వాత క్లాసులకు వెళ్లిపోయేవారు. యంగ్ క్రికెటర్స్ గట్రా అయ్యేవారు. ఏదో సాధిస్తూ ఉండేవారు.’
‘అలా వాళ్లందరూ ముందుకెళ్లిపోతుంటే.. నేను మాత్రం ఎగ్జామ్స్ పాస్ అవ్వలేదు. ముందుకెళ్లలేకపోతున్నానని ఆత్మనూన్యత భావం ఉండేది. అది ఓ స్థాయికి వచ్చిన తర్వాత చనిపోతే బాగుండు అనిపించింది. మా అన్నయ్య(చిరంజీవి) దగ్గర లైసెన్స్ రివాల్వర్ ఉండేది. 17 ఏళ్ల వయసులో నెల నెలన్నరపాటు బాగా డిప్రెషన్ గురై, చనిపోతే బాగుండు అని చాలా కామ్ గా ఉన్నాను. మా వదిన(సురేఖ) నన్ను చూసేది. ఓరోజు.. అన్నయ్య షూటింగ్ కి వెళ్లిపోతే ఆయన రూమ్ లోకి వెళ్లి గన్ తో కాల్చేసుకుందామని అనుకున్నాను. నాగబాబు వస్తే.. తనతో అనుకోకుండా కాల్చేసుకుంటా అని అనేశాను. అన్నయ్య వెళ్లిపోగానే నేను ఆయన రూంలోకి వెళ్దాం అనుకునే టైంకి వదిన, నాగబాబు వచ్చి నన్ను పట్టేసుకున్నారు. ఆ తర్వాత మా అన్నయ్య దగ్గరకు తీసుకెళ్లిపోయి నా పరిస్థితి గురించి వివరించారు. దీంతో ‘నువ్వు ఏం చదవకపోయినా పర్లేదు గానీ బతికి ఉండురా బాబు’ అని అన్నయ్యతో పాటు ఇంట్లోవాళ్లు అన్నారు. ఆ విషయం నన్ను కాపాడింది.’ అని పవన్ చెప్పుకొచ్చారు. ఇది చూసి చాలామంది ఫ్యాన్స్ షాకవుతున్నారు. మరి పవన్ చెప్పిన మాటలపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.