హాలీవుడ్ సినిమాలంటే ఎక్కువగా గుర్తొచ్చేది యాక్షన్ సన్నివేశాలు. ప్రతీ యాక్షన్ సినిమాలోనూ మతి పోగొట్టే యాక్షన్ సీక్వెన్స్ ఒకటో రెండో ఉండి తీరతాయి. అలాంటి యాక్షన్ సినిమాల్లో ప్రముఖ హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూస్ నటించిన ‘‘మిషిన్ ఇంపాజిబుల్’’ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమాల్లోని అన్ని యాక్షన్ సీక్వెన్స్ ఎలాంటి డూప్ లేకుండా చేస్తున్నారు టామ్. ప్రాణాలకు తెగించి ప్రతీ సీన్‌ను రియలస్టిక్‌గా ఉండేలా చూసుకుంటున్నారు. ఆయన ప్రస్తుతం మిషన్ ఇంపాజిబుల్ 7లో నటిస్తున్నారు. ఈ సినిమా 2023 జులైలో విడుదలవ్వటానికి సిద్దంగా ఉంది. ఈ నేపథ్యంలోనే సినిమాకు సంబంధించిన ఓ యాక్షన్ సీక్వెన్స్ తాలూకా ఓ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.
ఆ వీడియోలో టామ్ క్రూస్ అత్యంత సాహసోపేతమైన స్టంట్ చేశారు. ఎత్తైన రోడ్డు లాంటి నిర్మాణం మీదనుంచి బైకుతో లోయలోకి దూకారు. తర్వాత ప్యారాచూట్ సహాయంతో కిందకు దిగారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ చేయటానికి టామ్ చాలా కష్టపడ్డారు. రోజులో 30 సార్లు హెలికాఫ్టర్ మీదనుంచి స్కై డైవ్ చేసేవారు. ఇలా మొత్తం 500స్కై డైవ్స్, తర్వాత 13 వేల సార్లు బైక్ క్రాసింగ్ జంప్స్ కూడా చేశారు. అంతేకాదు! స్టంట్ చేస్తున్నపుడు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండటానికి, స్టంట్ చక్కగా రావటానికి చిత్ర స్టంట్ బృందం చాలా జాగ్రత్తలు తీసుకుంది. వాతావరణాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వచ్చింది. చివరగా ఓ పెద్ద లోయ దగ్గర వంతెన లాంటి భారీ నిర్మాణాన్ని చేపట్టారు. దీనికోసం కూడా కేవలం హెలికాఫ్టర్లను రవాణా మార్గానికి వాడుకున్నారు.
ఇక, స్టంట్ చేయవల్సిన సమయం రానే వచ్చింది. అప్పటికే చాలా సార్లు ప్రాక్టీస్ చేసిన టామ్‌కు ఇది పెద్ద విషయం కాదు. కానీ, అంత ఎత్తు నుంచి దూకినపుడు ప్యారాచూట్ తెరుచుకోకపోతే భయంకరంగా దెబ్బలు తగులుతాయి. లేదా ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది. అందుకే స్టంట్ టీమ్ మొత్తం భయపడుతూ ఉంది. టామ్ క్రూస్ బైకుతో బ్రిడ్జిమీదకు చేరారు. వాయువేగంతో దూసుకుపోయి లోయలోకి దూకారు. కొన్ని సెకన్ల తర్వాత కిందవరకు పోయిన తర్వాత ప్యారాచూట్‌ను విడుదల చేశారు. తర్వాత క్షేమంగా కిందకు దిగారు. దీంతో టీమ్ మొత్తం ఊపిరి పీల్చుకుంది. ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్లు చేయటం టామ్‌కు కొత్తేమీ కాదు. చాలా సార్లు స్టంట్లు చేసి ప్రమాదాలకు కూడా గురయ్యారు. మరి, టామ్ క్రూస్ విన్యాసంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.