నటనకు శరీర ఆకృతితో సంబంధం లేదు అని నిరూపించారు గీతా సింగ్. చేసింది కొన్ని సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వెన్నంటిన విషాదాలను ఎదుర్కొంటూ జీవితమనే ప్రయాణానాన్ని కొనసాగిస్తున్నారు.
సినిమా వాళ్ల జీవితాలు ఎంతో సంతోషంగా గడిచిపోతుంటాయని అందరూ భావిస్తుంటారు. అయితే, దూరపు కొండలు నునుపు అన్నట్లుగా వారి జీవితాల్లోని విషాదకర భాగం ఎవ్వరికీ కనిపించదు. భగభగమండే లావాను దాచుకున్న కొండలా వారి జీవితాలు సాగుతూ ఉంటాయి. హీరోయిజం చేసే హీరోలు కావచ్చు.. విలనిజం చేసే విలన్లు కావచ్చు.. మనల్ని కడుపుబ్బా నవ్వించే కమెడియన్లు కావచ్చు. అందరి జీవితాల్లోనూ విషాదాలు కామన్. అయితే, ఒకరి జీవితాలను మించి మరొకరి జీవితాల్లో కష్టాలు ఉండటం ఇక్కడ కొసమెరుపు. తెలుగు వారికి బాగా సుపరిచితురాలైన లేడీ కమెడియన్ గీతా సింగ్ జీవితంలోనూ ఎన్నో విషాదాలు దాగి ఉన్నాయి.
వృత్తి పరంగా.. వ్యక్తిగతంగా ఆమె ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. ఇప్పటికీ కష్టాలు ఆమెను వెంటాడుతున్నాయి. గతంలో గీతా సింగ్ ఓ వ్యక్తిని నమ్మి కోట్ల రూపాయలు నష్టపోయారు. సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి చెప్పుకుని గీతాసింగ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి సంపాందిచుకున్న డబ్బును ఓ మనిషిని నమ్మి పోగొట్టుకున్నాని తెలిపారు. ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ని నమ్మి.. ఆమె దగ్గర చిట్టీలు వేశానని.. ఆమె మోసం చేయడంతో సుమారు 5 కోట్ల రూపాయలు నష్టపోయానని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది ఆ డబ్బుల గురించి ఆమెను అడిగి బాధపెట్టారు.
దీంతో గీతా సింగ్ రెండు సార్లు సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించింది. కానీ, ఆమె స్నేహితురాలు చూసి కాపాడింది. చనిపోయే ధైర్యం లేక బతకటానికి నిశ్చయించుకున్నారు. సమాజంలోని వ్యక్తుల ప్రవర్తన కారణంగా పెళ్లి విషయంలోనూ వెనకడుగు వేశారు. డబ్బు, హోదా ఉన్నపుడు మాత్రమే మనల్ని అందరూ గుర్తిస్తారని అన్నారు. అందుకే అన్న పిల్లల్ని దత్తత తీసుకుని పెంచుకుంటున్నట్లు తెలిపారు. వారితో కలిసి ఉంటున్నారు. అయితే, ఈ విషయంలోనూ ఆమెకు సంతోషం లేకుండా పోయింది. ఆమె పెంచుకుంటున్న ఇద్దరు అన్న పిల్లలలో ఒకరు చనిపోయారు. తాజాగా కర్ణాటకలో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. కియా కారులో ప్రయాణిస్తున్న నలుగురు యాక్సిడెంట్ లో చనిపోయారు.
ఈ ఘటనలో చనిపోయింది గీతాసింగ్ పెద్ద కుమారుడు అని సమాచారం. ఎన్ని కష్టాలు వచ్చినా పిల్లలతో సంతోషంగా జీవితాన్ని గడుపుతున్న ఆమెకు ఇది మరో పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. కాగా, 2005లో వచ్చిన ‘ఎవడిగోల వాడిదే’ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆమె వెండి తెరకు పరిచయం అయ్యారు. 2007లో వచ్చిన ‘కితకితలు’ సినిమా ద్వారా హీరోయిన్‌గా మారారు. ఈ సినిమాలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిపోయాయి. కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకే పరిమితం అయ్యారు. అరకొర సినిమాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మరి, గీతా సింగ్ కన్నీటి గాథపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.