గతేడాది సరిగ్గా సంక్రాంతి సమయంలో సినిమా రిలీజ్ చర్చలు భారీగానే జరిగాయి. ఏవేవో ఊహాగానాలు.. కట్ చేస్తే.. రవితేజ క్రాక్, రామ్ రెడ్ సినిమాలు తప్ప పెద్ద సినిమాలు లేకుండా పోయాయి. అదికూడా క్రాక్ హిట్ అయింది కాబట్టి చెప్పుకోడానికి మిగిలింది. కానీ ఈసారి అటు పెద్ద సినిమాలు, ఇటు మీడియం సినిమాలు రెండూ సంక్రాంతి రేసు నుండి తప్పుకున్నాయి.
గతేడాది క్రాక్ లాంటి మీడియం సినిమా అయినా వచ్చింది. కానీ ఈసారి సంక్రాంతికి అన్నీ చిన్న సినిమాలే. ముందుగా సంక్రాంతి బరిలో నుండి RRR కోసం భీమ్లానాయక్ తప్పుకుంది. సరే RRR అయినా వస్తుందిలే.. అనుకునేలోపు అదికూడా వాయిదా పడింది. తాజాగా ప్రభాస్ ‘రాధేశ్యామ్’ బాక్సాఫీస్ నుండి వెనుదిరిగి నిరాశపరిచింది. ఇలా మూడు పెద్ద హీరోల సినిమాలు వాయిదా పడేసరికి ఈ ఏడాది సంక్రాంతికి అసలు సందడి లేకుండా పోయింది.ఇక ప్రస్తుతానికి చర్చలో దశలో ఉన్న సినిమా బంగార్రాజు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా 13న వస్తుందంటూ భారీ అంచనాలైతే సెట్ చేసింది. కానీ బంగార్రాజు వస్తుంది అనటంలో కూడా క్లారిటీ లేదు. గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాలలో కరోనా కేసులు వేల సంఖ్యలో విజృంభిస్తున్నాయి. మరోవైపు ఓమిక్రాన్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇక తాజా సమాచారం ప్రకారం.. మరో వారం రోజుల్లో కేసులు భారీ సంఖ్యలో పెరిగే అవకాశం ఉందని నిపుణుల బృందాలు చెబుతున్నాయి.
ఒకవేళ కరోనా థర్డ్ వేవ్ వచ్చినా తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్, కఠినమైన ఆంక్షలు ఉండవని అధికార వర్గాలు చెప్పుకొస్తున్నాయి. కానీ ఇలాంటి పరిస్థితిలో థియేటర్లు తెరిచినా వచ్చి చూసేందుకు జనాలు సిద్ధంగా ఉండరని తెలిసిందే. పైగా బంగార్రాజు సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ చాలా ముఖ్యం. కాబట్టి కింగ్ నాగ్ కూడా బంగార్రాజు విడుదల గురించి ముందడుగు వేసే ఛాన్స్ లేదని ఇండస్ట్రీ వర్గాలలో టాక్. ఇక కరోనా ప్రభావం త్వరలో తగ్గుముఖం పడితే.. టాలీవుడ్ బిగ్ బడ్జెట్ సినిమాలన్నీ మార్చి నుండి రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. మొత్తానికి కరోనా పుణ్యమంటూ ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ సందడి లేనట్టే. మరి ఈ బోసిపోయిన బాక్సాఫీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.