తెలుగు సినిమా ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ‘అరుంధతి’. 2009లో వచ్చిన ఈ సినిమా తెలుగునాట సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమా అయినప్పటికి స్టార్ హీరోల స్థాయి కలెక్షన్లను రాబట్టింది. దర్శకుడు కోడి రామకృష్ణ తన మార్కు డైరెక్షన్‌తో సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ప్రధాన పాత్రలో నటించిన అనుష్క తన పాత్రకు ప్రాణం పోశారు. అరుంధతి అంటే అనుష్క అనేంతలా పాత్రలో ఒదిగిపోయారు. ఈ సినిమాలో నటించిన చాలా మంది నటీ,నటులకు మంచి పేరు వచ్చింది.
సోనూసూద్ తన విశ్వరూపాన్ని చూపించారు. విలనిజంలో మరో లెవెల్‌ను కళ్లకు కట్టారు. ఇక, ఇదే సినిమాలో అనుష్క చిన్నప్పటి పాత్రను దివ్య నగేశ్ చేసింది. అరుంధతిలో దివ్య కనిపించేది కొన్ని నిమిషాలే అయినా.. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అల్లు అర్జున్ వరుడు సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత ఏడాదికి దివ్య హీరోయిన్‌గా మారింది. 2011లో వచ్చిన ‘ప్రసకార నన్‌బర్‌గల్’ అనే తమిళ సినిమాలో లీడ్ రోల్ చేసింది. అదే సంవత్సరం తెలుగులో ‘నేను నాన్న అబద్ధం’ అనే సినిమా చేసింది. ఇక, దివ్య కుటుంబ నేపథ్యం విషయానికి వస్తే.. ఆమె 1988 ఏప్రిల్ 13న కేరళలోని అలపుల జిల్లాలో జన్మించింది.
వీరిది సంప్రదాయ మలయాళ కుటుంబం. దివ్య చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను స్టార్ట్ చేసింది. తమిళ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమెకు తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. కేవలం తమిళం, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటుంది.