స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన యాక్షన్ మూవీ ‘బీస్ట్’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటిరోజే బాక్సాఫీస్ వద్ద నెగటివ్ టాక్ తెచ్చుకుంది. అదే సమయంలో పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్-2 రావడంతో బీస్ట్ మూవీ కలెక్షన్స్ పై భారీ ప్రభావం పడింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో విడుదలైన బీస్ట్ మూవీ.. ఇటీవలే 200కోట్ల క్లబ్ లో చేరినట్లు తెలుస్తుంది.
ఇక తమిళనాడులో విజయ్ స్టార్ కాబట్టి ఫస్ట్ డే మాత్రం కలెక్షన్స్ బాగానే వచ్చాయి. కానీ సినిమా చూసిన విజయ్ అభిమానులు సైతం బీస్ట్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. కోకో కోకిల, డాక్టర్ సూపర్ హిట్లతో దూసుకుపోతున్న దర్శకుడు నెల్సన్ తెరకెక్కించడం.. ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి మరో కారణం. కానీ థియేటర్లలో ఫ్యాన్స్ ఆశలన్నీ అడియాశలయ్యాయి. తాజాగా బీస్ట్ మూవీపై హీరో విజయ్ తండ్రి చంద్రశేఖర్ స్పందించారు.
ఆయన మాట్లాడుతూ.. “అరబిక్ కుత్తు పాటను ఫ్యాన్స్ ఎలా ఎంజాయ్ చేశారో.. నేను కూడా అంతే ఎంజాయ్ చేశాను. కానీ బీస్ట్ సినిమా కేవలం విజయ్ స్టార్డమ్ మీదే సాగినట్లు అనిపించింది. అంతర్జాతీయ ఉగ్రవాదులకు సంబంధించిన సీరియస్ సబ్జెక్ట్ ఎంచుకున్నప్పుడు స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేయాలి. ఈ సినిమాలో అది మిస్ అయ్యింది. స్క్రీన్ ప్లే బాలేదు. దర్శకుడు మిలటరీ ఫోర్స్, రా ఏజెంట్స్ ఎలా ఉంటారు? ఏం చేస్తారనేది లోతుగా స్టడీ చేసి సినిమా తీయాల్సింది. బీస్ట్ సినిమా సక్సెస్ కి సంగీత దర్శకుడు, కొరియోగ్రాఫర్, ఫైట్ మాస్టర్, ఎడిటర్, హీరో వీళ్ళే కారణం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు” అని చెప్పుకొచ్చారు. మరి బీస్ట్ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.