నందమూరి తారకరత్న మృతితో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. నేడు అనగా ఫిబ్రవరి 22న తారకరత్న పుట్టిన రోజు. నేడు 40 వ ఏట అడుగుపెట్టాల్సిన వ్యక్తి.. కనరాని లోకాలకు వెళ్లాడు అంటూ కుటుంబ సభ్యులు, అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని పాత ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు..
నందమూరి తారకరత్న మరణం.. ఆయన కుటుంబంలోనే కాక ఫ్యాన్స్‌కి కూడా తీరని ఆవేదనని మిగిల్చింది. 40 ఏళ్లు కూడా నిండకుండానే తారకరత్న కన్నుమూయడం ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. తారకరత్న జన్మించిన నెలలోనే మృతి చెందాడు. ఫిబ్రవరి 22న తారకరత్న పుట్టిన రోజు. 4 రోజులు గడిస్తే 40 వ పుట్టిన రోజు జరుపుకునేవాడు తారకరత్న. కానీ విధి రాత మరోలా ఉంది. పుట్టిన రోజుకు నాలుగు రోజుల ముందే తుది శ్వాస విడిచాడు తారకరత్న. ఈ విషయం తలుచుకుని ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో బాబాయ్ బాలకృష్ణతో కలిసి తారకరత్న పుట్టినరోజు జరుపుకున్న ఫోటోలను మరోసారి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. వైరల్ చేస్తున్నారు.
గత నెల 27 లోకేష్ పాదయాత్ర యువగళం ప్రారంభం సందర్భంగా ఆ కార్యక్రమంలో పాల్గొనడం కోసం తారకరత్న కుప్ప వచ్చాడు. అయితే ఉన్నట్లుండి తీవ్రమైన గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం చేశారు. సుమారు 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి.. చివరకు శివరాత్రి రోజున అనగా ఫిబ్రవరి 18న తుది శ్వాస విడిచారు. తారకరత్న అస్వస్థతకు గురైన నాటి నుంచి బాలకృష్ణ అన్ని దగ్గరుండి చూసుకున్నాడు. తారకరత్న మృతి తర్వాత అతడి ముగ్గురు పిల్లల బాధ్యతను బాలయ్యే తీసుకున్నట్లే వార్తలు వచ్చాయి.
తారకరత్న బతికుంటే నేడు ఆయన 40వ పుట్టిన రోజు జరుపుకునేవాడు. కానీ దురదృష్టవశాత్తు మొదటి జయంతి జరుపుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో అభిమానులు తారకరత్నని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. అంతేకాక గతంలో తారకరత్న బాలయ్య బాబాయ్‌తో కలిసి పుట్టినరోజు జరుపుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నెటిజనులు. ఈ ఫోటోలు చూస్తే.. బాలయ్యతో తారకరత్నకు ఎంత బలమైన బాండ్ ఉందో అర్థం అవుతుంది. ఈ పుట్టిన రోజు వేడుకల్లో తారకరత్న, ఆయన భార్య అలేఖ్య, నారా రోహిత్ ఉన్నారు. వీరంతా కలిసి ఎంతో సంతోషంగా పుట్టిన రోజు జరుపుకున్నారు. సీనియర్ హీరోయిన్ సుమలత కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ ఫోటోలు చేసిన నెటిజనులు వీరిమధ్య ఇంత మంచి సంబంధం ఉంది కనుకే.. తారకరత్న అనారోగ్యానికి గురైనప్పుడు బాలకృష్ణ అంత కేర్ తీసుకున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు.
ఈ ఫోటోలు చూసిన వారు.. తారకరత్న బతికుంటే.. అనారోగ్యం నుంచి కోలుకుంటే.. ఈ ఏడాది కూడా ఇంతే ఘనంగా పుట్టిన రోజు వేడుకలు జరుపుకునేవాడు కదా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తారకరత్న తన బాబాయ్ బాలయ్యతో కలిసి ఎప్పటికైనా ఒక సినిమాలో నటించాలని అనుకునేవారు. పలు ఇంటర్వ్యూలలో తన మనసులోకి కోరిక బయట పెట్టారు తారకరత్న. బాలయ్య ప్రస్తుతం నటిస్తున్న ఎన్బికే 108లో తారకరత్నకి ఒక పాత్ర సిద్ధం చేయడానికి చర్చలు కూడా జరిగాయట. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి స్వయంగా వెల్లడించాడు. తారకరత్న కల నిజమయ్యే లోపే ఇంత విషాదం చోటు చేసుకుంది అంటున్నారు అభిమానులు.