నయనతార-విఘ్నేశ్ శివన్ తిరుపతి దేవాలయాన్ని సందర్శించే సమయంలో మాడ వీధుల్లో చెప్పులతో తిరగడంతో ఎంత వివాదం రాజుకున్న సంగతి విదితమే. దర్శకుడు ఓం రౌత్, నటి కృతిసనన్ వ్యవహారం రాద్దాంతం అయ్యింది. ఇప్పుడు మరో ఇద్దరు సెలబ్రిటీలు..
ఈ మధ్య కాలంలో అభిమానుల మనో భావాలు దెబ్బతినే విధంగా పవిత్ర స్థలాల్లో సెలబ్రిటీలు ప్రవర్తిస్తున్నారు. మొన్నటికి మొన్న కోలీవుడ్ జంట నయనతార-విఘ్నేశ్ శివన్ తిరుపతి దేవాలయాన్ని సందర్శించే సమయంలో మాడ వీధుల్లో చెప్పులతో తిరగడంతో ఎంత వివాదమైందో అందరికీ తెలుసు. అలాగే ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తిరుపతిలో జరిపారు. అయితే ఈ సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నారు ఆ చిత్ర దర్శకుడు ఓం రౌత్, నటి కృతిసనన్. దర్శనం అనంతరం వెళ్లిపోతున్న కృతి.. ఓం రౌత్‌కు బై చెప్పగానే, అతను ఆమెను కౌగిలించుకుని బుగ్గపై ముద్దు పెట్టారు. ఆ తర్వాత ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చారు. ఇదంతా వీడియోలో రికార్డ్ అయ్యింది. తిరుమల కొండపై ఇటువంటి పనులెంటనీ మండిపడ్డారు హిందు వాదులు.
ఇప్పుడు మరో సినీ సెలబ్రిటీ జంట వివాదంలో చిక్కుకుంది. పవిత్ర స్థలంలో కౌగిలించుకోవడాన్ని తప్పుపడుతున్నారు సిక్కు మతస్థులు. ఇంతకు ఆ సెలబ్రిటీలు ఎవరంటే.. అమీషా పటేల్..సన్నీడియోల్. వీరిద్దరూ కలిసి గదర్-2 లో నటిస్తున్నారు. ఈ సినిమాను సిక్కుల పవిత్ర స్థలమైన గురుద్వారాలో కొన్ని సన్నివేశాలు తెరకెక్కించింది చిత్ర బృందం. అందులో కౌగిలింత, ముద్దు సీన్ ఇక్కడే చిత్రీకరించినట్లు ఓ వీడియో వైరల్ కావడంతో సిక్కులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పంచకులలోని గురుద్వారా శ్రీ కుహ్ని సాహిబ్ నిర్వాహకులు దీనిపై తీవ్రంగా స్పందించారు. గురుద్వారా మేనేజర్ సత్బీర్ సింగ్, సెక్రటరీ శివ కన్వర్ సింగ్ సంధు మాట్లాడుతూ.. అమీషా పటేల్, సన్నీడియోల్ పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తామని చిత్ర బృందం కోరిందని తెలిపారు.
ఈ షూటింగ్ చేసేటప్పుడు ఎలాంటి దురుద్దేశపూర్వక సన్నివేశాలు తీయడం లేదని చెప్పారన్నారు. భైసాఖి పండుగ ప్రాముఖ్యత దృష్టా కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తామన్నారు. అయితే ఇప్పుడు ఇలాంటి సన్నివేశాలు తీయడమేమిటని మండిపడుతున్నారు. శిరోమణి గురుద్వార్ పర్బంధక్ కమిటీ కార్యదర్శి గురుచరణ్ సింగ్ గ్రేవాల్ మాట్లాడుతూ.. గురుద్వారలో నమస్కరించే దృశ్యాన్ని చిత్రీకరిస్తామని చిత్ర బృందం తెలిపిందన్నారు. తరువాత రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరించడం ఏంటని ఫైర్ అయ్యారు. ఈ వివాదం దర్శకుడు అనిల్ శర్మ, నటీనటులపై చర్యలు తీసుకునేలా పురిగొల్పినట్లయింది.