సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లకు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉండటం తెలిసిందే. ఫ్యాన్స్ అసోసియేషన్ తో సినీ తారలపై తమ అభిమానం ఎంతో గొప్పగా చూపిస్తుంటారు. ఇక రాజకీయాలు, క్రీడా రంగాల్లో కూడా కొంతమందికి ఫ్యాన్స్ ఉంటారు. అయితే దర్శకుడికి ఓ హీరో హార్డ్ కోర్ ఫ్యాన్ అయితే.. ఆ అభిమానం ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోండి. అవును ఓ అప్ కమింగ్ హీరో దర్శకుడిపై తనకు ఉన్న అభిమానం ఎంత గొప్పగా చాటుకున్నాడో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..
సువీక్షిత్ బొజ్జా అనే నవ హీరో ఎన్నో ఏళ్లుగా దర్శకుడు సుకుమార్‌కి వీరాభిమాని. పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’తో భారతదేశం గర్వించదగ్గ దర్శకులలో ఒకరిగా నిలిచిన సుకుమార్ పై ఉన్న ప్రేమతో, అభిమానంతో.. ఇప్పటి వరకు ఏ అభిమాని కూడా చేయని ఓ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టాడు. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలోని బోరెడ్డిగారి పల్లి గ్రామంలో.. ఆయన సొంత వ్యవసాయం భూమిలో రెండున్నర ఎకరాల భూమిలో దర్శకుడు సుకుమార్ రూపాన్ని వచ్చేటట్లు వరి పంటతో సాగు చేశారు. మొదట పొలం సాగు చేసి ముగ్గుతో సుకుమార్ చిత్రం వేయించి తర్వాత ఆ రూపాన్ని వచ్చేటట్లు వరి పంటతో సాగు చేశారు.
ఇందు కోసం 50 రోజుల పాటు ప్రత్యేక శ్రద్ద వహించాడు. ఈ సాగుచేసిన పంట భూమిని ఆ రూపానికి తీసుకువచ్చిన తర్వాత.. డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించడంతో పాటు.. సుకుమార్ పేరు మీద ఓ ప్రత్యేక పాటను రెడీ చేశాడు. సుకుమార్ రూపంతో పాటు.. ‘పుష్ప 2’ అని కూడా వరిసాగు చేయడం.. అల్లు అర్జున్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ పాట వీడియో చూసి దర్శకుడు సుకుమార్ కంట కన్నీరు వచ్చిందట. ‘నా నోట మాట రావడం లేదు.. నా కళ్లు చెమర్చాయి. ఓ మనిషి మీద ఇంత అభిమానం ఉంటుందా?..’ అంటూ అందరి సమక్షంలో సువీక్షిత్‌ని అభినందించారు.