రొటీన్‌కు భిన్నంగా విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించడంలో ముందుంటారు హీరో సుధీర్ బాబు. సినిమాలో కథ, కథనాలతోపాటు తన పాత్ర కూడా వైవిధ్యంగా ఉండేలా జాగ్రత్త పడతారాయన. ‘ప్రేమ కథా చిత్రమ్’, ‘సమ్మోహనం’ లాంటి సాఫ్ట్ మూవీస్‌తో ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న సుధీర్ బాబు.. క్యారెక్టర్ బాగుందంటే విలన్‌గా నటించడానికీ వెనుకాడరు. హిందీ చిత్రం ‘బాగీ’, నాని సినిమా ‘వీ’నే ఇందుకు ఉదాహరణ. ఈ రెండు చిత్రాల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో తనదైన మార్క్ నటనతో సుధీర్ బాబు మంచి మార్కులు వేయించుకున్నారు. అయితే ఇటీవల ఆయనకు వరుసగా పరాజయాలు పలకరిస్తున్నాయి. సుధీర్ బాబు గత చిత్రాలు ‘శ్రీదేవి సోడా సెంటర్’, ‘ఆ అమ్మాయి పేరు మీకు చెప్పాలి’ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయాయి.
ఎలాగైనా హిట్ కొట్టాలనే కసి మీదున్న సుధీర్ బాబు.. ‘హంట్’ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ మీద ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మహేష్ సూరపనేని దర్శకత్వం వహించారు. ప్రముఖ సంగీత దర్శకుడు గిబ్రాన్ సంగీతాన్ని సమకూర్చిన ‘హంట్’ చిత్రంలో సీనియర్ నటుడు శ్రీకాంత్, తమిళ నటుడు భరత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ ఇవాళ విడుదలైంది. గతాన్ని మర్చిపోయిన అర్జున్ అనే పోలీస్ ఆఫీసర్.. ఓ కేసును ఎలా ఛేదించాడనేదే సినిమా కథాంశంగా తెలుస్తోంది. అర్జున్ పాత్రలో సుధీర్ బాబు నటిస్తున్నారు. ఇందులో శ్రీకాంత్, భరత్ కూడా పోలీస్ అధికారులుగా కనిపిస్తున్నారు. సుధీర్ బాబు సరసన చిత్రా శుక్లా హీరోయిన్గా యాక్ట్ చేస్తున్న ‘హంట్’ చిత్రం.. ఈనెల 26న బిగ్ స్క్రీన్లలో రిలీజ్ కానుంది. సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న సుధీర్ బాబు ఈ మూవీతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి. మరి, సుధీర్ బాబు ‘హంట్’ ట్రైలర్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.