సినిమా అనేది రంగుల ప్రపంచం. దూరం నుంచి చూసేవారికి చాలా అందంగా కనబడుతుంది. కానీ ఇండస్ట్రీలో దిగితే గానీ దాని లోతు తెలియదు. ఇండస్ట్రీకి వచ్చి పేరు, ప్రతిష్టలతో పాటు కోట్లు గడించిన వాళ్ళు ఉన్నారు. అదే ఇండస్ట్రీలో మనుషులను నమ్మి కోట్లు పోగొట్టుకున్న వారూ ఉన్నారు. ఒకటి రెండు లక్షలు పోగొట్టుకుంటే ఏదో అనుకోవచ్చు. మరీ 2 కోట్లు పోగొట్టుకుంటే.. ఇక ఆ వ్యక్తి జీవితం ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. అలాంటి పరిస్థితినే సినీ నటుడు శివ బాలాజీ ఎదుర్కోవాల్సి వచ్చింది. వ్యాపార నేపథ్యం ఉన్న శివ బాలాజీ.. సినిమాల మీద ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చారు. ‘ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన శివ బాలాజీ.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సక్సెస్ అయ్యారు.
చందమామ సినిమాలో సెకండ్ హీరోగా నటించి.. మంచి పేరు తెచ్చుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 1లో పార్టిసిపేట్ చేసి.. టైటిల్ గెలుచుకున్నారు. అయితే తాను ఈ స్టేజ్ కి వచ్చే క్రమంలో అనేక ఎదురుదెబ్బలు తిన్నట్లు చెప్పుకొచ్చారు శివ బాలాజీ. అనేక వ్యాపారాలు చేశానని, సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహరించానని చెప్పుకొచ్చారు. చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే ఇష్టం, అందులోనూ వ్యవసాయం, వ్యాపార నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో ఈము పక్షుల వ్యాపారం చేశానని అన్నారు. 1500 పక్షులు కొని బాగా నష్టపోయినట్లు చెప్పుకొచ్చారు. వాటి మేతకి నెలకి 4 నుంచి 5 లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చేదని చెప్పారు. అయితే ఆ వ్యాపారం కలిసి రాలేదని వెల్లడించారు.
అదే సమయంలో తాను నటించిన ‘స్నేహమేరా జీవితం’ సినిమాకి నిర్మాతగా కూడా ఉన్నానని చెప్పుకొచ్చారు. ఆ సినిమా వల్ల కూడా చాలా నష్టపోయినట్లు చెప్పుకొచ్చారు. ఎవరినీ నమ్మడానికి వీల్లేదని, ఇదొక మాఫియా స్కామ్ అని.. రిలీజ్ సమయంలో ఆ సినిమాని వదిలేసినట్లు చెప్పుకొచ్చారు. సినిమాకి పెట్టుబడి పెట్టి వదిలేసినా కూడా.. మళ్ళీ దాన్ని ప్రమోట్ చేయడానికి పోస్టర్ల కోసం డబులివ్వాలని అడిగితే 70 నుంచి 80 లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చిందని.. అలా ఈ సినిమా వల్ల 2 కోట్లు నష్టపోవాల్సి వచ్చిందని వెల్లడించారు. ఆ సమయంలో ఆ సినిమాకి పని చేసిన టెక్నీషియన్ల పరిస్థితి ఏంటి? హిట్ అయి ఉంటే వాళ్ళ కెరీర్ బాగుండేది కదా.. డబ్బులు అనవసరంగా వృధా చేసానా అని బాధపడ్డారట. ఆ సమయంలో ఆయన సతీమణి మధుమిత ధైర్యం చెప్పారట.
‘సంపాదించిన డబ్బంతా ఇండస్ట్రీ వాళ్ళకే కదా ఇచ్చారు. పని కోసమే కదా ఇచ్చారు. ఇదే కదా మీకు కావాల్సింది. డబ్బు వృధా ఏం పోలేదు’ అంటూ మధుమిత చెప్పడంతో శివ బాలాజీ ఆ బాధ నుంచి బయటకు వచ్చారట. ఇలా తనకు తన భార్య తాను జీవితంలో వేసిన ప్రతీ అడుగులోనూ ధైర్యం చెప్పి ముందుకు నడిపించినట్లు చెప్పుకొచ్చారు. ఈ విషయాలను సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంత డబ్బు పోగొట్టుకున్నా కూడా మన వాళ్ళే కదా తిన్నారు అని ఆలోచించడం నిజంగా గొప్ప విషయం. మరి మధుమిత, శివ బాలాజీ వ్యక్తిత్వంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి. అలానే శివ బాలాజీ, మధుమిత దంపతులు ఎన్నో అనుభవాలను సుమన్ టీవీతో పంచుకున్నారు. ఆ వీడియో చూసి ఇతరులకు షేర్ చేయడం చేయండి. వీళ్ళని చూసి కష్టాల్లో కూడా ఎలా ధైర్యంగా ఉండాలో ఆదర్శంగా తీసుకుంటారు.